ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలని డిమాండ్
హొసపేటె: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌పై సీఎం సిద్దరామయ్య చేసిన అనుచిత వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకుని క్షమాపణ చెప్పాలని బీజేపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో జిల్లాధికారిణి కవిత ఎస్.మన్నికేరికి వినతిపత్రాన్ని అందజేశారు. బీజేపీ మహిళా నాయకురాలు విజయలక్ష్మి మాట్లాడుతూ సీఎం సిద్దరామయ్య వ్యాఖ్యలు యావత్ మహిళా లోకాన్ని అవమానించాయన్నారు. అందువల్ల సీఎం సిద్దరామయ్య వెంటనే నిర్మలా సీతారామన్‌తో సహా మొత్తం మహిళా సమాజానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపడతామని హెచ్చరించారు. బీజేపీ మహిళ విభాగం అధ్యక్షురాలు డాక్టర్. అరుంది సువర్ణ, రాష్ట్ర మహిళా మోర్ఛా కార్యదర్శి సుగుణ, కార్యనిర్వాహక సభ్యురాలు వాణిశ్రీ, జిల్లా మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి మీరా బాయి, వివిధ మహిళా విభాగాల నాయకురాళ్లు, కార్యకర్తలు పాల్గొన్నారు.
నవ వివాహిత ఆత్మహత్య
బొమ్మనహాళ్: కడుపునొప్పి తాళలేక ఇటీవలే పెళ్లయిన ఓ యువతి ఆత్మహత్యయత్నానికి పాల్పడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం చనిపోయింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. విడపనకల్లు గ్రామానికి చెందిన సరోజమ్మ, పెద్ద లింగన్న కుమారై జయలక్ష్మి (23) ని గత 3 నెలల క్రితం బొమ్మనహాళ్ మండలంలోని కురువల్లి కి చెందిన గోవిందప్ప కుమారుడు బోయ గురుస్వామికి ఇచ్చి పెళ్లి చేశారు. జయలక్ష్మి కొంతకాలంగా తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతోంది. ఈ క్రమంలో వారం కిందట ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా కుటుంబ సభ్యులు గమనించి వెంటనే బళ్లారి విమ్స్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మరణించినట్లు తెలిపారు. మృతురాలి తల్లి సరోజమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
అభివృద్ధికి మనమే విరోధులం
రాయచూరు రూరల్: కళ్యాణ కర్ణాటక జిల్లాల అభివృద్ధికి మనమే వ్యతిరేకులమని, అదే ఈ ప్రాంత వెనుకబాటుకు ప్రధాన కారణమని అంతర్జాతీయ బుకర్ అవార్డు విజేత దీపా బస్తీ అభిప్రాయ పడ్డారు. మంగళవారం సాయంత్రం కలబుర్గి విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన విప్లవ సాహిత్యం, హెచ్‌టీ పోతే రాసిన అంబేడ్కర్ జీవిత కథా పుస్తకాలను విడుదల చేసి మాట్లాడారు. ఈ ప్రాంత ప్రజలు కవులు, సాహితీ వేత్తలు, మూడు భాషల సాంగత్యం ఉందన్నారు. నైసర్గికంగా బలంగా ఉన్న సాహిత్యబలాన్ని ఉపయోగించుకోవాలన్నారు. విద్యార్థులు కళ్యాణ కర్ణాటక జిల్లాల అభివృద్ధికి ముందడుగు వేయాలన్నారు. భాష ద్వారా కూడా అభివృద్ధి అంశాలను ప్రస్తావించాలన్నారు. కన్నడ భాషాభివృద్ధికి ప్రతి ఒక్కరూ ప్రామాణికంగా పని చేయాలన్నారు. సమావేశంలో విజయ శంకర్, శశికాంత్, రమేష్, సాగర్‌లున్నారు.
పథకం లబ్ధి పొందండి
రాయచూరు రూరల్: కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన స్వామిత్య పథకాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని దక్షిణ బీదర్ శాసన సభ్యుడు శ్రీశైలేంద్ర బిరాదార్ పేర్కొన్నారు. దక్షిణ బీదర్ తాలూకా రేకుళిగిలో జరిగిన సభలో మాట్లాడారు. గ్రామీణ భాగంలోని రైతులు ఇంటి, ఆస్తి పన్ను వివరాల రికార్డులను పొందడానికి హక్కు పత్రాలను డ్రోన్ యంత్రాల ద్వారా అందిస్తామన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2020 లో జాతీయ పంచాయత్‌రాజ్ దినోత్సవాన్ని ప్రారంభించి రికార్డులను భద్రపరుచుకోవడానికి అవకాశం కల్పించారన్నారు. కార్యక్రమంలో అధికారి మాణిక్ రావ్, మల్లికార్జున, సుదేశ్, నాగరాజ్, వీరణ్ణ, విద్యావతి, శిల్పా, రాజ్ కుమార్, నాగేశ్, మహేష్, ప్రకాష్‌లున్నారు.
హెల్మెట్ ధారణ.. ప్రాణ రక్షణ
రాయచూరు రూరల్: ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించి ప్రాణాలు కాపాడుకోవాలని పశ్చిమ పోలీస్ స్టేషన్ సీఐ మేకా నాగరాజ్ పిలుపునిచ్చారు. మంగళవారం అంబేడ్కర్ సర్కిల్ వద్ద ద్విచక్రవాహనదారులకు చైతన్యపరిచి ఆయన మాట్లాడారు. నానాటికీ ద్విచక్రవాహన ప్రమాదాల్లో మరణిస్తున్న వారి సంఖ్య పెరుగుతోందన్నారు. మరో వైపు మద్యం తాగి మొబైల్‌లో మాట్లాడుతూ నడపడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నారు.
ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలని డిమాండ్
ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలని డిమాండ్


