సాక్షి, బళ్లారి: లోకంలో తొలి పూజలు అందుకునే విఘ్నేశ్వరుడు వాడవాడలా పూజలందుకున్నాడు. బుధవారం వినాయక చవితిని పురస్కరించుకుని నగరంలో మండపాలు ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున గణపయ్యలను కొలువుదీర్చారు. ఎంజీ సర్కిల్ వద్ద అనంతపద్మనాభ స్వామి రూపంలో ప్రతిష్టించిన వినాయక విగ్రహం స్థానికులను ఆకట్టుకుంటోంది. మోకా రోడ్డులోని ఎంఆర్‌వీ లేఔట్, వాజ్‌పేయి లేఔట్, కప్పగల్ రోడ్డు, తాళూరు రోడ్డు, పటేల్ నగర్, సత్యనారాయణ పేట, విశాల్ నగర్, శ్రీరాంపురం కాలనీ, కౌల్‌బజార్, మిల్లర్‌పేట్, విద్యా నగర్, దేవీ నగర్, ఓపిడి సర్కిల్, బండిహట్టి, సుధాక్రాస్, బెలగల్లు క్రాస్, తదితర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన వందలాది వినాయక విగ్రహాలకు పూజలు చేశారు. వినాయక మండపాలను విద్యుత్ దీపాలతో ప్రత్యేకంగా అలంకరించారు. రాత్రి వేళల్లో మండపాల వద్ద నిర్వహిస్తున్న వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు అలరిస్తున్నాయి. ఇక ఎంఆర్‌వీ లేఔట్‌లో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద శ్రీనివాస కళ్యాణానికి సంబంధించి కళాకారిణులు ప్రదర్శించిన నృత్యం అందరినీ కట్టిపడేసింది. గణనాథుల మండపాల వద్ద అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. మూడు రోజుల పాటు వినాయక మండపాల వద్ద అన్నదానం చేస్తామని వినాయక భక్త మండలి సభ్యులు తెలిపారు. ఆయా గణనాథుల మండపాల వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఎమ్మెల్యే గాలి జనార్దన్‌రెడ్డి పూజలు..
సాక్షి, బళ్లారి: నగరంలోని అనంతపురం రోడ్డులో ఎంజీ సర్కిల్ వద్ద ఏర్పాటు చేసిన అనంత పద్మనాభ శ్రీ గణేశ విగ్రహాన్ని గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్దన్‌రెడ్డి, ఆయన సతీమణి గాలి లక్ష్మీ అరుణ, మాజీ ఎమ్మెల్యే సోమశేఖర్‌రెడ్డి దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేయించి, మొక్కులు చెల్లించుకున్నారు.
జంట నగరాల్లో కోలాహలం
హుబ్లీ: వినాయక చవితి వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి. జంట నగరాల్లో హుబ్లీక రాజ, నవనగరక రాజ తదితర ప్రముఖ వినాయక మండలి వేదికల్లో వినాయకులను కొలువుదీర్చారు. మండపాలను సుందరంగా అలంకరించి, డీజే శబ్దాల హోరు నడుమ యువత సందడి చేశారు. యువత పాటలకు ఉత్సాహంగా చిందులు వేశారు. నవ నగర క్యాన్సర్ ఆస్పత్రి ఎదుట తదితర భాగాల్లో మండపాలకు భారీ విగ్రహాలను తరలించే వేళ యువజనుల కేకలు మిన్నంటాయి. పోలీసులు భారీ బందోబస్తు మధ్య ఈ వేడుకలు జరిగాయి. స్థానిక నవనగర్‌లో ప్రవసాంధ్ర ప్రముఖులు నీలచల్ ఎయిర్‌డ్రసెస్ వ్యవస్థాపకులు వినాయక చవితి వేడుకలను కుటుంబ సభ్యులతో జరుపుకున్నారు. ఇక ఈద్గా మైదానంలో తగిన బందోబస్తు మధ్య భారీ వినాయక విగ్రహం కొలువుదీరింది.
యువత సందడి..
హొసపేటె: విజయనగర జిల్లా అంతటా వినాయక చవితిని ఘనంగా జరుపుకున్నారు. వివిధ అలంకరణల్లో గణేష్ విగ్రహాలను మండపాల్లో ప్రతిష్టించారు. గణేష్ విగ్రహాలను ట్రాక్టర్, టాటా ఏసీ వాహనాల్లో ప్రముఖ వీధుల్లో ఊరేగించారు. అనంతరం మండపాల్లో కొలువుదీర్చి విశేష పూజలు నిర్వహించారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో భక్తులు మండపాల వద్దకు వెళ్లలేక పోయారు. విజయనగర జిల్లా వ్యాప్తంగా మొత్తం 2,030కి పైగా గణేష్ విగ్రహాలను ప్రతిష్టించారని సమాచారం. టీబీ డ్యాం, చిత్తవాడిగి, మృత్యుంజయ నగర, నెహ్రు కాలనీ, పటేల్ నగర్, అంబేడ్కర్ నగర్, అమరావతి, మెయిన్‌బజార్, బళ్లారి రహదారి, బసవేశ్వర వీధి, రాజీవ్ నగర్, సాయి నగర్, తిరుమల నగర్ తదితర చోట్ల వివిధ అలంకరణల్లో ఉన్న గణేష్ విగ్రహాలను ప్రతిష్టించారు.
భక్తిశ్రద్ధలతో వినాయక చవితి వేడుకలు
మండపాల్లో కొలువుదీరిన గణపయ్యలు
విగ్రహాలకు ప్రత్యేక పూజలు చేసిన భక్తులు
ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు
గణపతి బప్పా మోరియా..
రాయచూరురూరల్: నగరంలో వినాయక చవితి సందడి నెలకొంది. బుధవారం ఉదయం నుంచి రాత్రి వరకు మండపాల్లో వినాయకులను ప్రతిష్టించారు. తీన్ కందిల్‌లో నక్షత్రాల గణపతి, సూపర్ మార్కెట్ వద్ద మహరాజ గణపతి, మడివాళ నగరలో లంబోదరుడు, గీత మందిర్ శ్రీక్రష్ణ విఘ్నేశ్వరుడు, బావసార వీధిలో అశ్వ వాహన వినాయకుడు, భంగికుంటలో ఉగ్ర నరసింహ రూపంలో వినాయకుడు, హరిహర రోడ్డులో విష్టు అవతారంలో గణపతి, శెట్టి బావి సర్కిల్‌లో లాల్ బాగ్‌కా రాజ్ వినాయకుడు, వేంకటేశ్వర రూపంలో వినాయకులను కొలువుదీర్చారు. తొమ్మిది రోజుల పాటు జరిగే పూజలకు పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. కిల్లే మఠం, సూపర్ మార్కెట్ వద్ద గణనాథులకు శాంతమల్ల శివాచార్య, కాంగ్రెస్ కార్యకర్త రవి ప్రత్యేక పూజలు చేయించారు. యాదగిరిలో చిన్న పరిశ్రమల శాఖ మంత్రి శరణ బసప్ప దర్శనాపూర్ గణపతికి పూజలు చేశారు.
ఉండ్రాళ్లయ్యా.. దండాలయ్యా
ఉండ్రాళ్లయ్యా.. దండాలయ్యా
ఉండ్రాళ్లయ్యా.. దండాలయ్యా
ఉండ్రాళ్లయ్యా.. దండాలయ్యా
ఉండ్రాళ్లయ్యా.. దండాలయ్యా
ఉండ్రాళ్లయ్యా.. దండాలయ్యా
ఉండ్రాళ్లయ్యా.. దండాలయ్యా