
ఆర్టీసీ బస్టాండ్‌లో దుకాణాలు బంద్
రాయచూరురూరల్: జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్‌లో దుకాణాలను యజమానులకు చెప్పకుండా అధికారులు మూసివేయించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఈ దుకాణాలకు ఈనెల 31వ తేదీ వరకూ గడువు ఉంది. అయితే అధికారులు యజమానులకు నోటీసులు ఇవ్వకుండా ఈనెల 22వ తేదీన దుకాణాలు మూసివేయించారు. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో దుకాణాల యజమానులు ఇబ్బందులు పడుతున్నారు. అప్పులు చేసి వ్యాపారం చేస్తున్నామని.. నోటీసులు ఇవ్వకుండా దుకాణాలు బంద్ చేయించడం సరికాదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రైవేట్ బస్సు బోల్తా
● ఇద్దరు మృతి ●11 మందికి గాయాలు
హుబ్లీ: అదుపు తప్పి ఓ ప్రైవేట్ బస్సు బోల్తా పడిన ఘటనలో ఇద్దరు ప్రయాణికులు మృతి చెందారు. మరో 11 మంది గాయపడిన ఘటన బెళగావి తాలూకా బడేకొళ్ల మఠం వద్ద బుధవారం రాత్రి చోటు చేసుకుంది. వివరాలు.. హుబ్లీ నుంచి పునాకు వెళ్లున్న ఓ ప్రైవేట్ బస్సు బడేకొళ్ల మఠం వద్ద అదుపు తప్పింది. చిన్న వంతెన గోడను ఢీకొని బోల్తా పడింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఓ మహిళతో పాటు మరొకరు అక్కడికక్కడే మృతి చెందారు. హిరేబాగేవాడే పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్నారు. బస్సులో చిక్కుకున్న 11 మందిని బయటకు తీసి ప్రాణాలు కాపాడారు. వీరిని చికిత్స నిమిత్తం బెళగావి జిల్లా ఆస్పత్రి తరలించారు. మృతులు, క్షతగాత్రుల వివరాలు తెలియాల్సి ఉంది. కాగా బడేకొళ్లమఠం యాక్సిడెంట్ జోన్‌గా మారింది. ప్రమాదాలను నివారించే క్రమంలో నగర పోలీస్ శాఖ హైవే ప్రాధికారతో కలిసి మెరుగైన చర్యలు తీసుకుంటున్నారు. అయినా ప్రమాదాలకు అడ్డుకట్ట పడటం లేదు.
‘కాంగ్రెస్‌కు ప్రజాస్వామ్యంపై విశ్వాసం లేదు’
హుబ్లీ: కాంగ్రెస్ నేతలకు ప్రజాస్వామ్యంపై విశ్వాసం లేదు. పార్లమెంట్ సమావేశాల నిర్వహణకు ఆటంకాలు సృష్టించారని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ఆరోపించారు. గురువారం స్థానిక మీడియాతో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు అకారణంగా సమావేశాలను రెండు మూడు రోజులు సాగనివ్వ లేదన్నారు. సమావేశాల్లో 13 బిల్లులు ఆమోదించామని తెలిపారు. ఈసారి పార్లమెంట్ సమావేశాల్లో కాంగ్రెస్ బండారం బయట పడిందన్నారు. లేనిపోని విషయాలపై చర్చించాలని పట్టుబట్టారని మండిపడ్డారు. దేశ సంపదను కుదువపెట్టే ప్రయత్నాలను కాంగ్రెస్ చేస్తోందన్నారు. ఇలాగే కొనసాగితే దేశంలో కాంగ్రెస్ జోరో అవుతుందని జోస్యం చెప్పారు. అలాగే ధర్మరస్థల తవ్వకాలు, బాను ముస్తాక్, దసరా ఉత్సవాల శ్రీకారం, గురించి మాట్లాడారు. హుబ్లీ చెన్నమ్మ సర్కిల్ ఫ్లై ఓవర్‌ను జనవరిలోగా నిర్మాణం పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌కు సూచించామన్నారు.