
లంచాలు తీసుకుంటే ఉపేక్షించం
రాయచూరురూరల్: బాధ్యతాయుతమైన ఉద్యోగాల్లో ఉంటూ హుందాగా పని చేయకుండా లంచాలు తీసుకోవడంపై ఉప లోకాయుక్త బి.వీరప్ప ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం రాయచూరులోని వివిధ ప్రాంతాల్లో పర్యటించారు. ఏసీఎంసీ, రిమ్స్, ఒపెక్, రసాయనాల పరిశ్రమల కేంద్రం వడ్లూరు, బస్టాండ్, హాస్టల్‌ను పరిశీలించి అసంతృప్తి చెందారు. వడ్లూరు రసాయనాల పరిశ్రమల కేంద్రం నుంచి నీరు నదిలోకి వదులుతుండటంతో ప్రజలకు వ్యాధులు సోకే అవకాశాలు అధికంగా ఉన్నాయని తెలిపారు. పంచాయతీ అధికారులు, పరిసరాల సంరక్షణ అధికారులపై మండిపడ్డారు. గ్రామ పంచాయతీ అభివృద్ధి అధికారిణి సరోజమ్మ, తాలూకా పంచాయతీ ముఖ్య కార్యనిర్వహణ అధికారి చంద్రశేఖర్‌పై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఏపీఎంసీలో రైతులకు సౌలభ్యాలు కల్పించడంలో నిర్లక్ష్యం చేసిన అధికారులపై సుమోటో కేసు దాఖలు చేయాలన్నారు. కూరగాయల మర్కెట్లో కార్మికులకు మౌలిక సౌలభ్యాలు కల్పించాలని తెలిపారు. అధిక శాతం బీహర్ కార్మికులతో పని చేయిస్తూ.. రాయచూరు కార్మికులకు పనులు కల్పించక పోవడంపై అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బస్టాండ్‌లో క్యాంటీన్‌ను సందర్శించి ఆహార పదార్థాలను రుచి చూశారు. కార్మికుల కాలనీకి బస్ నడపాలని సూచించారు. ఒపెక్, రిమ్స్ అస్పత్రులను పరీశీలించి.. అందుతున్న సేవలపై రోగులను అడిగి వివరాలు సేకరించారు.