
నగదుతో ఉడాయించిన డ్రైవర్ అరెస్ట్
చెళ్లకెర రూరల్: రూ.97 లక్షల నగదు, కారుతో ఓ డ్రైవర్ ఉడాయించాడు. అప్రమత్తమైన పోలీసులు గంటల వ్యవధిలో అతడి ఆచూకీ కనుక్కున్నారు. డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని, రూ.97 లక్షల నగదు, కారు స్వాధీనం చేసుకున్నారు. చెళ్లకెర సర్కిల్ ఇన్‌స్పెక్టర్ కుమార్ తెలిపిన వివరాలు.. బెంగళూరుకు చెందిన రిటైర్డ్ ఎస్పీ గురుప్రసాద్ బుధవారం భార్యతో కలసి ఓ కారును బాడుగకు తీసుకుని బళ్లారికి వెళ్లారు. అక్కడ పొలం అమ్మిన రూ.97 లక్షల నగదును తీసుకుని తిరిగి బెంగళూరుకు బయలుదేరారు. మార్గంమధ్యలో చెళ్లకెర వద్ద భోజనం కోసం హోటల్‌కు వెళ్లారు. ఈ సమయంలో కారులో ఉన్న రూ.97 లక్షలతో పాటు కారును తీసుకుని డ్రైవర్ రమేష్ పరారీ అయ్యాడు. రిటైర్డ్ ఎస్పీ గురుప్రసాద్ వెంటనే ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. అప్రమత్తమైన పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. కారు డ్రైవర్ రమేష్‌ను అరెస్ట్ చేశారు. రూ.97 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. కాగా.. డ్రైవర్ రమేష్ హిందూపురానికి చెందినవాడని పోలీసులు తెలిపారు. సినీ పక్కీలో కేసు ఛేదించిన పోలీసులను స్థానికులు అభినందించారు.
గంటల వ్యవధిలో
కేసు ఛేదించిన పోలీసులు
రూ.97 లక్షల నగదు, కారు స్వాధీనం