
బడా నేపాలీ దొంగల ముఠా అరెస్టు
యశవంతపుర: మాజీ మంత్రి దివంగత గోవిందగౌడ ఇంటిలో భారీగా దొంగతనం చేసిన అంతర్రాష్ట్ర దొంగల ముఠాను చిక్కమగళూరు జిల్లా కొప్ప పోలీసులు అరెస్ట్ చేశారు. ముగ్గురు నేపాల్‌వాసులను అరెస్ట్ చేసి రూ. కోటిన్నర విలువగల బంగారు నగలు, ఇతరత్రా సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు కొప్ప పోలీసులు తెలిపారు. ఈ నెల 21న తెల్లవారుజామున 2:55 గంటల సమయంలో హరందూరు గ్రామంలోని మణిపుర ఎస్టేట్‌లోని మాజీ మంత్రి దివంగత గోవిందగౌడ కొడుకు ఉంటున్న హెచ్‌జి వెంకటేశ్ ఇంటిలోకి దొంగలు చొరబడ్డారు. రూ.6 లక్షల నగదు, రూ.37.50 లక్షలు విలువగల బంగారు, వెండి ఆభరణాలను చోరీ చేసుకొని పరారయ్యారు. వెంకటేశ్ ఫిర్యాదు ఆధారంగా కొప్ప పోలీసులు విచారించారు. మహారాష్ట్ర పోలీసుల సహకారంతో సాంగ్లిలో దాగి ఉన్న నేపాల్‌కు చెందిన రాజేంద్ర, ఏకేంద్ర కుటల్ బద్దాల్, కరంసింగ్ బహుదూర్‌ను అరెస్ట్ చేశారు. బంగారం, వెండి, కొంత నగదు, ఉపయోగించిన రెండు కార్లను స్వాధీనం చేసుకున్నట్లు చిక్కమగళూరు జిల్లా ఎస్‌పీ విక్రం అమటె తెలిపారు.
ఈడీ కస్టడీకి ఎమ్మెల్యే వీరేంద్ర
● బెట్టింగ్, క్యాసినోల కేసు..
దొడ్డబళ్లాపురం: కోట్లాది రూపాయల అక్రమ బెట్టింగ్ కేసులో చిత్రదుర్గ ఎమ్మెల్యే కేసీ వీరేంద్రను ఈడీ అధికారులు అరెస్టు చేశారు. 28 వరకూ వీరేంద్రను ఈడీ కస్టడీకి అప్పగిస్తూ బెంగళూరు 35వ సీసీహెచ్ కోర్టు ఆదేశించింది. క్యాసినోని కాంట్రాక్టు ఇచ్చేందుకు చర్చించడానికి గ్యాంగ్‌టక్‌కు వెళ్లిన వీరేంద్రను శనివారం నాడు ఈడీ అధికారులు అరెస్టు చేశారు. ఆదివారం తెల్లవారుజామున బెంగళూరుకు తీసుకువచ్చారు. అక్రమ బెట్టింగ్ ఆరోపణలతో ఇటీవల ఆయనకు చెందిన చిత్రదుర్గలో 6, బెంగళూరులో 10, గోవాలో 8, జోథ్‌పూర్‌లో 3, ముంబైలో 2, హుబ్లీలో 1 చోట ఈడీ అధికారులు సోదాలు జరిపారు. రూ.1 కోటి విదేశీ కరెన్సీ, రూ.6 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు, 10 కేజీల వెండి, నగదు, 4 ఖరీదైన వాహనాలను సీజ్ చేశారు. 17 బ్యాంకు ఖాతాలను, 2 బ్యాంకు లాకర్లను ఫ్రీజ్ చేశారు.
పరప్పన జైలులో
ఖైదీపై హత్యాయత్నం
బనశంకరి: బెంగళూరు పరప్పన అగ్రహార జైలులో భరత్ అనే ఖైదీ, అతని అనుచరులు అనిల్‌కుమార్ అనే ఖైదీపై ప్రాణాంతక దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఖైదీ అనిల్‌కుమార్ ఓ కేసులో విచారణ కోసం వీడియో కాన్ఫరెన్స్ గదికి వెళుతున్నాడు. ఈ సమయంలో భరత్ గ్యాంగ్.. మమ్మల్ని ఎగతాళి చేస్తావా అని కత్తి, రాడ్లతో అనిల్‌కుమార్ పై దాడికి దిగారు. తీవ్రంగా గాయపడిన అతనిని జైలులోని ఆసుపత్రికి తరలించారు. ఘటనపై భరత్‌తో పాటు 8 మందిపై వివిధ సెక్షన్ల కింద పరప్పన పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ఖైదీ అనిల్‌కుమార్ హత్యకేసులో 2023లో జైలుకెళ్లాడు, భరత్ 2025లో హత్య కేసులో అరెస్టయ్యాడు.

బడా నేపాలీ దొంగల ముఠా అరెస్టు