
కాలువలోకి కారు పల్టీ!
● ఆచూకీ లేని వ్యక్తి
యశవంతపుర: హాసన్ జిల్లా హొళెనరసీపుర తాలూకా హరళహళ్లి గ్రామం వద్ద హేమావతి జలాశయం ఎడమ కాలువలోకి కారు పడిపోయింది. వివరాలు.. ప్రేమకుమార్ అనే వ్యక్తి ఈ నెల 17 న అదృశ్యమయ్యాడు. తండ్రి తిమ్మేగౌడ శాంతిగ్రామ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. శనివారం రాత్రి అతని కారు హరళహళ్లి వద్ద హేమావతి కాలువలో బయట పడింది. దీంతో ప్రేమకుమార్ కారులో వెళ్తూ కాలువలోకి పడి ఉంటాడని అనుమానాలున్నాయి. హొళెనరసీపుర పోలీసులు పరిశీలించారు. పోలీసులు ప్రేమకుమార్‌కు ఫోన్ చేయగా రింగ్ అయింది. కొద్దిసేపటి తరువాత స్విచాఫ్ అయ్యింది. ఆ సిమ్‌కార్డు భార్య వద్ద ఉన్నట్లు తెలిసింది. దీంతో కొత్త అనుమానాలు పుట్టుకొస్తున్నాయి. ప్రేమకుమార్ కోసం పోలీసులు, ఫైర్ సిబ్బంది తీవ్రంగా గాలిస్తున్నారు.
ఏనుగు దాడి, ఇద్దరికి గాయాలు
మైసూరు: చామరాజనగర జిల్లాలోని గుండ్లుపేట పట్టణం నుంచి గ్రామానికి బైక్‌పై వెళుతుండగా ఏనుగులు దాడి చేయడంతో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. గుండ్లుపేట తాలూకాలోని మంగళ గ్రామానికి చెందిన బంగారి (45), రత్నమ్మ (55) బైక్‌లో వెళుతుండగా అడవిలో నుంచి వచ్చిన తల్లీ పిల్ల ఏనుగు ఆకస్మాత్తుగా దాడి చేశాయి. దీంతో ఇద్దరూ బైక్ మీద నుంచి పడి, ఎలాగో పరిగెత్తి ప్రాణాలు దక్కించుకున్నారు. ఈ మార్గంలో తరచూ అడవి ఏనుగులు దాడుల వల్ల ప్రజలు గాయపడుతున్నారు. బైక్‌లు, కార్లను అడ్డుకుని రభస చేస్తున్నాయి. అటవీ సిబ్బంది నివారణ చర్యలను తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.