
మాతృత్వానికే మాయని మచ్చ
శివమొగ్గ: ముద్దులొలికే శిశువును కన్నతల్లే అంతమొందించింది. శివమొగ్గ నగరంలోని ప్రభుత్వ మెగ్గాన్ ఆస్పత్రి ప్రసూతి వార్డులో టాయ్‌లెట్‌లో నవజాత మగ శిశువును గొంతు కోసి హత్య చేసిన కేసులో హంతకురాలు ఎవరో కాదు తల్లే అని బయటపడింది. దావణగెరె జిల్లా హొన్నల్లి తాలూకా తిమ్లాపురానికి చెందిన శైలా ను అరెస్ట్ చేసి కారాగారానికి తరలించారు. దొడ్డపేట సీఐ రవి పాటిల్ వివరాలను వెల్లడించారు. 16న మెగ్గాన్ ఆస్పత్రి టాయ్‌లెట్‌లో గొంతు కోసి చంపిన శిశువు మృతదేహం కనిపించింది. ప్రసూతి వార్డులో చేరిన మహిళలు, శిశువుల వివరాలను సేకరించారు. పుట్టిన శిశువులందరూ వార్డులోనే ఉన్నట్లు గుర్తించారు.
ఏం జరిగిందంటే..
కడుపునొప్పిగా ఉందని అదే రోజు ప్రసూతి వార్డులో చేరిన శైలాను ప్రశ్నించారు. శిశువు మృతదేహాన్ని చూపించి అడిగినా ఆమె ఒప్పుకోలేదు. పోలీసులు లోతుగా దర్యాప్తు ప్రారంభించారు. శైలకు ఇద్దరు పిల్లలున్నారు. నాలుగు సంవత్సరాల క్రితం కుటుంబ నియంత్రణ ఆపరేషన్ కూడా అయ్యింది. కానీ ఇటీవల గర్భం దాల్చింది. కుటుంబానికి చెప్పకుండా దాచిపెట్టింది. 16వ తేదీన ప్రసవవేదన రాగా, కడుపునొప్పి అంటూ ఆస్పత్రిలో చేరిన ఆమెకు శిశువుకు జన్మించింది. ఆ శిశువు వద్దనుకున్న ఆమె కిరాతకురాలిగా మారిపోయింది. టాయ్‌లెట్‌కు తీసుకెళ్లి కత్తితో గొంతు కోసి ప్రాణాలు తీసింది. ఆమెకు సహకరించిన ఇద్దరు పురుషులను కూడా అరెస్టు చేశారు. ఈ ఘోరానికి కుటుంబ వ్యవహారాలే కారణమని అనుమానాలున్నాయి. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉందని సీఐ చెప్పారు.
పుట్టిన వెంటనే శిశువును గొంతు కోసి
హతమార్చిన తల్లి

మాతృత్వానికే మాయని మచ్చ