
జపాన్‌లో గజరాజుల జల్సా
బొమ్మనహళ్ళి: బెంగళూరు శివార్లలోని బన్నేరుఘట్ట జూ పార్క్ నుంచి జపాన్‌లోని హిమేజీ సెంట్రల్ పార్క్‌కు వెళ్లిన నాలుగు కన్నడనాడిన ఏనుగులు అక్కడి పరిసరాలకు, వాతావరణానికి అలవాటు పడ్డాయి. వాటితో పాటు జూపార్క్ నుంచి సిబ్బంది, అటవీ అధికారులు వెళ్లిన మావటీలు, అధికారులు తిరిగొచ్చారు. వేలాది కిలోమీటర్ల దూరంలో ఉన్న జపాన్‌లోని వాతావరణానికి ఇంత త్వరగా అలవాటు పడటం సంతోషంగా ఉందని తెలిపారు.
15 రోజులు ఉండి, మచ్చిక చేసి..
జపాన్‌తో జంతు వినిమయం కింద జూలై 24వ తేదీన బన్నేరుఘట్ట జూ నుంచి సురేష్, తులసి, గౌరి, శృతి అనే ఏనుగులను ప్రత్యేక విమానంలో జపాన్‌కు పంపించారు. అక్కడ కొన్నిరోజులు చూసుకోవడానికి బన్నేరుఘట్ట నుంచి మావటీలు, వైద్యులు, నిపుణులు కలిసి 8 మంది వెంట వెళ్లారు. అక్కడ హిమేజీ జూపార్క్‌లో గజరాజులను ఉంచారు. వారు 15 రోజులపాటు ఉండి ఏనుగులు జపాన్ వాతావరణంలో ఇమిడిపోయేలా చూసుకున్నారు. చిన్నపిల్లలకు చెప్పినట్లు గజరాజులకు బుద్ధిమాటలు చెబుతూ తర్ఫీదునిచ్చినట్లు తెలిపారు. అలాగే ఏనుగులతో ఎలా నడచుకోవాలో మెళకువలను హిమేజీ సెంట్రల్ పార్క్ సిబ్బందికి కూడా శిక్షణనిచ్చారు. నిత్యం ఏనుగులకు రాగి ముద్ద, చెరుకులు వంటి కన్నడనాడ జనాదరణ పొందిన ఆహారాన్ని పెట్టారు. చివరకు ఏనుగులు అక్కడ కుదురుకున్నాయని నిర్ధారించుకుని బన్నేరుఘట్ట జూ పార్క్ సిబ్బంది ఆగస్టు 10వ తేదీన బెంగళూరుకు తిరిగి వచ్చారు. ఎంతో ప్రేమగా సాకిన గజరాజులను వదిలి వస్తోంటే ఆనందభాష్పాలు ఆగలేదని అధికారులు సూర్యసేన్, సురేష్, ఐశ్వర్య సాక్షికి తెలిపారు.
జూలో సంచారం
కొత్త వాతావరణానికి అలవాటు పడటంతో పాటు అక్కడి క్వారెంటైన్‌లో గడిపిన ఏనుగులకు ఏ సమస్యా లేదని జపాన్ పశువైద్యులు పేర్కొనడంతో హిమేజీ సెంట్రల్ పార్క్‌లోకి వదిలారు. జూలో సందడిగా సంచరిస్తున్నాయి. పార్క్‌లో గణపతి పూజ నిర్వహించి ఏనుగులను వాటి వాటి స్థలాల్లోకి వదిలారు. ఆగస్టు 9వ తేదీ నుంచి పర్యాటకులకు కూడా అనుమతించారని మావటి కార్తీక్ తెలిపాడు. అధికారి సూర్యసేన్ మాట్లాడుతూ అత్యంత దూరంగా ఉన్న దేశంలో మన ఏనుగులను వదిలి రావడం బాధగా ఉందని అన్నారు. అవి అక్కడ చాలా బాగా ఉన్నాయని, సిబ్బంది శ్రద్ధగా చూసుకోవడం సంతోషంగా ఉందని కార్తీక్ చెప్పాడు.
ఏనుగుల కోసం రాగిముద్దను తయారు చేస్తున్న జపాన్ జూ సిబ్బంది
జపాన్ జూపార్క్‌లో గజరాజులు
కర్ణాటకలో ఏనుగులు ఎలాంటి ఆహారం తినేవో, ఇకనుంచి ఎలాంటి తిండి పెట్టాలో జపాన్ జూ సిబ్బందికి నేర్పించారు. ప్రతి ఏనుగుకు రోజూ 150 కేజీల ఆహారం ఇవ్వాలని సూచించారు. అందులో పండ్లు, రాగిముద్ద, బెల్లంతో పాటు చెరుకులు, కూరగాయలు, వరి అన్నం ఉండాలని బోధించారు. రాగి ముద్ద అంటే తెలియని జపాన్ జూ పార్క్ సిబ్బంది దానిని తయారు చేయడం నేర్చుకున్నారు. చివరి నాలుగు రోజులు వారే రాగి ముద్ద వండి ఏనుగులకు తినిపించారని తెలిపారు. ఏనుగుల యోగక్షేమాలను తరచూ తెలుసుకుంటూ ఉంటామని చెప్పారు.
జూలైలో బన్నేరుఘట్ట నుంచి వెళ్లిన
4 ఏనుగులు
అక్కడి పరిసరాలతో మమేకం
తిరిగి వచ్చిన జూపార్క్ సిబ్బంది
జపనీయుల రాగి ముద్ద

జపాన్‌లో గజరాజుల జల్సా

జపాన్‌లో గజరాజుల జల్సా

జపాన్‌లో గజరాజుల జల్సా