
రీల్స్ కోసం ప్రాణం పణం
యశవంతపుర: మినీ ట్రాక్టర్‌ను నడుపుతూ రీల్స్ చేయబోయిన యువకుడు ప్రాణం పోగొట్టుకున్న ఘటన హాసన్ జిల్లా అరకలగూడు తాలూకా కబ్బళ్లిగెరె గ్రామంలో జరిగింది. బీజీ కొప్పలువాసి కిరణ్‌కుమార్ ట్రాక్టర్ తీసుకుని కబ్బళ్లిగెరె కొండకు వెళ్లాడు. స్నేహితులు వీడియో తీస్తుండగా ట్రాక్టర్‌తో ప్రమాదకరంగా విన్యాసాలు చేస్తూ అదుపుతప్పి మలుపులో పల్టీలు కొట్టాడు. ట్రాక్టర్ కింద చిక్కుకున్న యువకుడు క్షణాల్లో మరణించాడు. కోణనూరు పోలీసులు కేసు నమోదు చేశారు.
మహదేశ్వరునికి
కాసుల వర్షం
మైసూరు: చామరాజనగర జిల్లాలోని హనూరు తాలూకా మలెమహదేశ్వర బెట్టలోని మహదేశ్వరునికి 33 రోజుల అవధిలో భక్తుల నుంచి రూ.2.20 కోట్ల కానుకలు లభించాయి. బెట్ట బస్టాండ్ వద్ద గల వాణిజ్య సంకీర్ణంలో సాలూరు బృహన్మఠం అధ్యక్షుడు శాంత మల్లికార్జున స్వామి సమక్షంలో ఆలయ హుండీలను తెరిచి లెక్కింపు ప్రక్రియ చేపట్టారు. ప్రభుత్వ సెలవు రోజు, అమావాస్య, జాతర మహోత్సవంతో పాటు పెద్దసంఖ్యలో మహిళా భక్తులు దర్శించుకోవడంతో కానుకలు పెరిగాయి. నగదుతో పాటు 55 గ్రాముల బంగారు, 1627 వెండి వస్తువులు లభించాయి. 30 దేశాల కరెన్సీ నోట్లు హుండీలలో లభ్యమయ్యాయి. చలామణిలో లేని రూ.2 వేల నోట్లు 7 వచ్చాయి.
బోర్ల నీటిపై పరిమితులు
● అసెంబ్లీలో చట్టం ఆమోదం
బనశంకరి: భూగర్బ జలాల సంరక్షణ, అభివృద్ధికి పెద్దపీట వేసేలా కర్ణాటక భూగర్భ జలాల (అభివృద్ధి, నిర్వహణ వినిమయ) సవరణ బిల్లు గురువారం విధానపరిషత్‌లో అమోదం పొందింది. ఈ చట్టం ప్రకారం, ఇకపై రోజుకు నిర్ణయించిన ప్రమాణంలోనే బోర్‌వెల్ నుంచి నీటిని వాడుకోవాలి. ప్రాధికార అనుమతి తీసుకోకుండా బోర్లను తవ్వరాదు. ప్రైవేటు ట్యాంకర్ల యజమానులు నీరు తోడటానికి ఎన్‌ఓసీ తప్పనిసరిగా పొందాలి. ప్యాకెట్ తాగునీరు తయారీదారులకు 1 నుంచి 25 వేల లీటర్ల వరకు ఎలాంటి శుల్కం ఉండదని మినహాయింపునిచ్చారు. గనులు, పరిశ్రమలతో పాటు ఇతర మౌలిక సౌకర్యాల కోసం 25 వేల లీటర్ల నుంచి 2 లక్షల లీటర్ల నీటిని వాడితే ప్రతి వెయ్యి లీటర్లకు రూ.1000 మేర సుంకం చెల్లించాలి. అపార్టుమెంట్లలో నిర్ణీత మొత్తం కంటే బోర్ల నుంచి నీటిని ఉపయోగించరాదు. బెంగళూరుతో సహా రాష్ట్రంలో విచ్చలవిడిగా భూగర్భ జలాలను వాడుతుండడంతో అడ్డుకోవడానికి సర్కారు ఈ చట్టాన్ని తెచ్చినట్లు తెలిసింది.

రీల్స్ కోసం ప్రాణం పణం