
సాక్షి, బెంగళూరు: ప్రేమ నిరాకరించినందుకు వివాహితను దారుణంగా హత్య చేశాడో కిరాతకుడు. సినీ ఫక్కీలో కారులో ఉంచి చెరువులోకి నెట్టేయడంతో ఆమె జలసమాధి అయ్యింది. ఈ సంచలన ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. మృతిరాలిని హాసన్ జిల్లా బేలూరు తాలూకా చందనహళ్లి గ్రామానికి సమీపంలో బేలూరుకు చెందిన శ్వేత (32)గా గుర్తించారు.
ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. శ్వేత కొంతకాలం కిందట భర్తను వదిలేసి పుట్టింటిలో ఉంటోంది. ఆమె హాసన్‌లో చిన్న ఉద్యోగం చేసుకుంటూ జీవిస్తోంది. ఈ క్రమంలో ఆమెకు రవి అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. తన భార్యను విడిచిపెట్టి వస్తానని, తనను పెళ్లాడాలని ఆమెను సతాయించేవాడు. అయితే, అతడి ప్రపోజల్‌ను ఆమె తిరస్కరించింది. దీంతో, ఆవేశానికి గురైన రవి శ్వేతను హతమార్చాలని నిర్ణయించుకున్నారు.
అనంతరం, ఆమెను బయటకు తీసుకెళ్లే క్రమంలో కారులో ఎక్కించుకుని వచ్చాడు. చందనహళ్లి చెరువు వద్దకు రాగానే కారును ఆపి.. కారులోనే శ్వేతను ఉంచి చెరువులోకి తోసేశాడు. తర్వాత.. కారు అనుకోకుండా చెరువులో పడిందని , అందులో స్నేహితురాలు ఉందని, తాను ఎలాగోలా ఈత కొట్టుకుంటూ బయటపడ్డాడనని పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అరేహళ్లి పోలీసులు అనుమానంతో ప్రశ్నించగా.. రవి నిజం ఒప్పుకున్నాడు. తానే ఆమెను హత్య చేసినట్టు తెలిపాడు.