
రాష్ట్రపతి పర్యటనకు పకడ్బందీగా ఏర్పాట్లు
మైసూరు: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సెప్టెంబర్ 1వ తేదీన మైసూరులోని అఖిల భారత వాక్ శ్రవణ సంస్థ సిల్వర్ జూబ్లీ వేడుకలో పాల్గొనేందుకు మైసూరుకు విచ్చేయనున్నారు. పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని జిల్లాధికారి జీ.లక్ష్మీకాంతరెడ్డి ఆదేశించారు. గురువారం జెడ్పీ సభాంగణంలో సమీక్ష జరిపారు. ప్రోటోకాల్‌లో ఎలాంటి లోపాలు లేకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు. రాష్ట్రపతి రాడిసన్ బ్లూ హోటల్‌లో బస చేస్తారని, అక్కడ భద్రత, ఇతరత్రా ఏర్పాట్లు కట్టుదిట్టంగా నిర్వహించాలన్నారు. రాష్ట్రపతి సంచరించే రోడ్లను పూర్తిగా మరమ్మతు చేయాలన్నారు. రింగ్ రోడ్డు, ఆయుష్ నుంచి రాడిసన్ బ్లూ వరకు రోడ్లు శుభ్రంగా ఉండేలా నగర పాలికె, ముడా, హైవే శాఖల అధికారులు బాధ్యత స్వీకరించాలన్నారు. మైసూరు పోలీస్ కమిషనర్ సీమా లాట్కర్, జెడ్పీ సీఈఓ ఎస్.యుకేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
బంగారంతో షరాబు పరారీ
మైసూరు: ఆభరణాలను చేయించి ఇస్తానని యజమాని నుంచి బంగారు బిస్కెట్‌లను తీసుకున్న షరాబు పరారైన ఘటన మైసూరులో జరిగింది. లష్కర్ ఠాణా పరిధిలోని కుంబారగేరికి చెందిన శ్రీకృష్ణ గోల్డ్‌స్మిత్ యజమాని సుఖాంత్ షరాబు రహమాన్ చేతిలో వంచనకు గురయ్యాడు. పశ్చిమ బెంగాల్‌లో ఉద్దాన్‌కు చెందిన నిందితుడు గత రెండేళ్లుగా షాపులో నమ్మకంగా పనిచేస్తూ ఉన్నాడు. సుఖాంత్ నుంచి బంగారాన్ని తీసుకుని నగలు చేసిచ్చేవాడు. ఇటీవల 200 గ్రాములకు పైగా బంగారాన్ని తీసుకుని ఉడాయించాడు. బాధితుడు ఠాణాలో ఫిర్యాదు చేశాడు.
డీఆర్‌ఐ విచారణకు డీజీపీ
బనశంకరి: కేజీల కొద్దీ బంగారం స్మగ్లింగ్ కేసులో అరెస్టయిన నటి రన్య రావ్ కేసులో దర్యాప్తు సాగిస్తున్న డీఆర్‌ఐ అధికారులు ఆమె పెంపుడు తండ్రి, డీజీపీ రామచంద్రరావ్ ను గురువారం విచారించారు. నోటీస్ ఇవ్వడంతో డీఆర్‌ఐ ఆఫీసులో హాజరయ్యారు. కర్ణాటక రాష్ట్ర చరిత్రలో డీజీపీని విచారించిన మొదటి కేసు కావడం విశేషం. బంగారం దొంగరవాణాలో ఆయన పాత్ర గురించి ప్రశ్నించారు.
చిక్కలో ప్రజలకు
నమ్మ కాప్ సేవలు
చిక్కబళ్లాపురం: జిల్లా పోలీస్ శాఖ మన కాప్ 24 ఇన్‌టు 7 అనే వాట్సాప్ సేవలను ప్రారంభించింది, ప్రజలకు పోలీసు సేవలను సులభతరం చేస్తోంది అని జిల్లా ఎస్పీ కుశాల్ చౌక్సి తెలిపారు. నగరంలోని కన్నడ భవనంలో నమ్మ కాప్ సేవలను ఆరంభించి మాట్లాడారు. ఇందులో ఎమర్జెన్సీ సేవలు, భద్రత, సైబర్ క్రైంల జాగృతి తదితర వివరాలు లభిస్తాయన్నారు. కన్నడ, తెలుగు, హిందీ, ఇంగ్లిష్ భాషల్లో లభ్యమని తెలిపారు. మొబైల్ నంబరు 9480802538, జిల్లా పోలీస్ ఇలాఖా వాట్సాప్ నంబరు 9480802518 లను మొబైల్‌లో సేవ్ చేసుకుని హాయ్ అని పంపితే సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు. 24 గంటలూ ఈ నంబర్లు పని చేస్తాయన్నారు. ఈ సందర్భంగా ఈ సేవలకు సహకరించిన పలువురిని సన్మానించారు.

రాష్ట్రపతి పర్యటనకు పకడ్బందీగా ఏర్పాట్లు