
పాలికె భేటీలో తోపులాట
హుబ్లీ: ముఖ్యమంత్రి వివేచన నిధి ద్వారా ఎమ్మెల్యే వినయ్ కులకర్ణి నియోజకవర్గానికి మంజూరు అయిన రూ.10 కోట్ల నిధుల కార్యచరణ పథకం ఆమోదం గురించి గురువారం హుబ్లీ–ధార్వార నగర పాలికె సమావేశంలో భారీ రగడ జరిగింది. నిధుల కార్యచరణ వివరాలు లేవంటూ కాంగ్రెస్ కార్పొరేటర్లు చర్చను అడ్డుకున్నారు. మేయర్ పీఠం ముందుకు వచ్చి రభస చేశారు. బీజేపీ కార్పొరేటర్లు కూడా గొడవకు దిగారు. మేయర్ జ్యోతి పాటిల్ రెండు సార్లు సమావేశాన్ని వాయిదా వేసినప్పటికీ ఉద్రిక్తత చల్లారలేదు. 3 గంటలకుపైగా అరుపులు కేకలతో రణరంగాన్ని తలపించింది. దీంతో కాంగ్రెస్ సభ్యులందరిని బలవంతంగా బయటకు పంపించారు. ఈ సమయంలో సభ్యుడు శివన్న కల్లుకుంట్ల బయటకు వెళ్తుండగా గుండెనొప్పి అని పడిపోవడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు.
ఒక్క కొళాయి చాలా?
తరువాత ప్రజలకు తాగునీరు సరఫరా కావడం లేదని, ఒక భవనానికి ఒకటే కొళాయి అనే విధానం సబబు కాదని సభ్యులు గొంతెత్తారు. ఒకే భవనంలో మూడు నాలుగు కుటుంబాలు ఉంటే ఒక్క కొళాయి నీళ్లు ఎలా సరిపోతాయని ప్రశ్నించారు. మేయర్ జ్యోతి స్పందిస్తూ తాగునీటి సమస్యను తీర్చాలని అధికారులను ఆదేశించారు.
హుబ్లీ– ధార్వాడ కార్పొరేషన్ సమావేశం రసాభాస