
కూతురికి విషమిచ్చి.. తల్లి ఆత్మహత్యాయత్నం
దొడ్డబళ్లాపురం: కుటుంబ కలహాలతో విరక్తి చెందిన ఓ తల్లి కఠినాత్మురాలిగా మారింది. చిన్నారి బిడ్డకు విషం పెట్టి చంపి తానూ ఆత్మహత్యాయత్నం చేసిన సంఘటన బెంగళూరు బ్యాడరహళ్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాలు.. తిగళరపాళ్య నివాసి చంద్రిక (26), భర్త యోగేష్, కూతురు (20 నెలలు) తో జీవిస్తున్నారు. యోగేష్ గార్మెంట్స్ కార్మికుడు. కొన్నిరోజులుగా తీవ్ర కుటుంబ కలహాలు జరుగుతున్నాయి. ఈ పరిణామాలతో విసిగిపోయిన ఆమె టీ లోకి ఎలుకల మందును కలిపి బిడ్డకు తాగించి తరువాత తానూ తాగింది. ఇద్దరూ బాధతో ఆర్తనాదాలు చేయడంతో స్థానికులు గుర్తించి ఆస్పత్రికి తరలించగా చిన్నారి మృతిచెందగా చంద్రిక చికిత్స పొందుతోంది. బ్యాడరహళ్లి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
రూ.70 లక్షల హషిష్ ఆయిల్ సీజ్
దొడ్డబళ్లాపురం: బెంగళూరు రైల్వేస్టేషన్ పోలీసులు రూ.70 లక్షల విలువైన హషిష్ అనే గంజాయి ఆయిల్‌ని పట్టుకున్నారు. దీనిని తరలిస్తున్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అప్పలరాజు (34) అనే వ్యక్తిని అరెస్టు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో భరత్ అనే వ్యక్తి నుంచి ఆయిల్ కొనుగోలు చేసి తీసుకువచ్చి యలహంకలో డ్రగ్స్ వ్యసనపరులకు విక్రయించేవాడు. సమాచారం అందడంతో పోలీసులు అతనిని అరెస్టు చేసి ఆయిల్‌ని సీజ్ చేశారు.
మద్యం మత్తులో తల్లికి నిప్పు
శివాజీనగర: మద్యం మత్తులో కుమారుడే తన తల్లికి నిప్పుపెట్టి, ఏమీ తెలియనట్టు పక్కనే నిద్రపోయాడు. ఈ దారుణ సంఘటన ఘటన చిక్కమగళూరు జిల్లా అరెనూరు సమీపంలోని అక్కిమక్కి గ్రామంలో జరిగింది. మహిళ భవాని (51) కూలి పని చేసుకొంటూ జీవించేది. కొడుకు పవన్ (27) తల్లితో కలసి నివాసమున్నాడు. బుధవారం రాత్రి బాగా తాగి వచ్చాడు, మద్యం తాగవద్దని, బుద్ధిగా పనిచేసుకోవాలని తల్లి మందలించింది. దీంతో కోపోద్రిక్తుడై గొడవపడ్డాడు. ఆమె మీద పెట్రోలు చల్లి నిప్పు పెట్టడంతో మంటల్లో కాలిపోసాగింది. కానీ దుండగుడు నిద్రపోసాగాడు. మహిళ కేకలు విన్న ఇరుగుపొరుగువారు చేరుకొని చూసేలోగానే పూర్తిగా కాలిపోయి చనిపోయింది. అల్దూరు పోలీసులు చేరుకొని కుమారున్ని అరెస్ట్ చేశారు. ఇతని తండ్రి కూడా తాగుబోతే. అతడు ఇంట్లో లేనప్పుడు ఈ ఘటన జరిగింది.
ఎమ్మెల్యే కొడుక్కి
దక్కని ఊరట
యశవంతపుర: కాబోయే భార్యపై అత్యాచారం, చీటింగ్ కేసులో బీజేపీ ఔరాద్ ఎమ్మెల్యే ప్రభు చౌహాన్ కొడుకు ప్రతీక్ బెయిలు అర్జీని బీదర్ సెషన్స్‌కోర్టు తిరస్కరించింది. బాధితురాలు అతనిపై స్థానికంగా, మహారాష్ట్రలో పోలీసులకు ఫిర్యాదు చేసింది. స్థానిక పోలీసులు ప్రతీక్‌పై అత్యాచారం సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో ముందస్తు బెయిలు అర్జీ దాఖలు చేయగా గురువారం విచారించారు. నిశ్చితార్థం చేసుకుని, షికార్లు చేసి పెళ్లి చేసుకోలేదని బాధితురాలు ఆరోపించింది.

కూతురికి విషమిచ్చి.. తల్లి ఆత్మహత్యాయత్నం