
అధిక లాభాలంటూ రూ.30 లక్షలు మస్కా
మైసూరు: మైసూరు నగరంలో మరో రెండు సైబర్ మోసాలు బయటపడ్డాయి. షేరు మార్కెట్‌లో డబ్బులు పెట్టుబడి పెడితే అధిక లాభాలు గడించవచ్చని ఆశపడిన ఓ వ్యక్తి రూ.30 లక్షలను కోల్పోయిన ఘటన మైసూరు నగరంలో జరిగింది. మైసూరులోని రాఘవేంద్రనగర నివాసికి ఓ యువతి ఫోన్ చేసి తన పేరు లావణ్య అని పరిచయం చేసుకుంది. షేర్ల వ్యాపారం చేస్తున్నామని, మీరు డబ్బులు పెట్టుబడి పెడితే ఎక్కువ లాభాలు గడించవచ్చని ఆశ పెట్టింది. ఆమె మాయమాటలను నమ్మిన బాధితుడు తన ఖాతా, తల్లి, స్నేహితుల ఖాతాల నుంచి దశల వారీగా రూ.30 లక్షలను పెట్టుబడి పెట్టాడు. అయితే ఎలాంటి లాభం అందక పోగా అసలు కూడా కోల్పోయినట్లు గ్రహించిన బాధితుడు సరస్వతీపురం పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.
డిజిటల్ అరెస్టు చేసి రూ.7.25 లక్షలు..
ముంబై పోలీసులమని చెప్పి మైసూరుకు చెందిన ఓ వ్యక్తిని బెదిరించిన దుండగులు రూ.7.25 లక్షలను మోసగించారు. మైసూరులోని కువెంపునగర నివాసికి ముంబై పోలీసుల పేరిట ఫోన్ చేసిన దుండగులు మీరు చట్టవ్యతిరేక కార్యకలాపాల్లో పాలుపంచుకున్నారు, మీపై చర్యలు తీసుకుంటున్నామని డిజిటల్ అరెస్టు చేశారు. మీ ఖాతాలో ఉన్న డబ్బులను కొంతకాలం పాటు తాము చెప్పిన ఖాతాకు బదలాయిస్తే పరిశీలించి తరువాత వాపస్ చేస్తామని నమ్మబలికారు. దీంతో తన ఖాతాలో ఉన్న రూ.7.25 లక్షలను బదిలీ చేసి మోసపోయాడు. సైబర్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
సింబాలిక్ పోటో
మైసూరులో ఆన్‌లైన్ నేరాలు