
తీర్థయాత్ర విషాదమయం
హోసూరు: తిరువణ్ణామలై యాత్రకు వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో కారు ప్రమాదం జరిగి ఇద్దరు మహిళలు చనిపోగా, ఐదు మందికి గాయాలేర్పడిన ఘటన గురువారం సాయంత్రం క్రిష్ణగిరి సమీపంలో జరిగింది. వివరాల మేరకు బెంగళూరుకు చెందిన వెంకటస్వామిరెడ్డి (56), భార్య మమత (55), కుమారుడు అనిల్ (28), బంధువులు రమేష్ (60) భార్య గిరిజ (50), కూతురు మౌల్యాతో కలిసి తిరువణ్ణామలైలోని ఆలయానికెళ్లి స్వామివారిని దర్శించుకొన్నారు. గురువారం సాయంత్రం బెంగళూరుకు బయల్దేరారు. క్రిష్ణగిరి– హోసూరు హైవేలో కురుబరపల్లి సమీపంలో కారు అదుపుతప్పి పల్లంలోకి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో మమత, గిరిజా తీవ్ర గాయాలతో ఘటనా స్థలంలోనే మరణించారు. కారు డ్రైవర్ ఆనేకల్‌వాసి మంజునాథ్ (45)తో పాటు వెంకటస్వామిరెడ్డి, రమేష్, అనిల్, మౌల్య తీవ్ర గాయాలకు గురయ్యారు. గమనించిన స్థానికులు, కురుబరపల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని గాయపడిన వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను హోసూరు ఆస్పత్రి మార్చురీకి తరలించారు. వారి వారి బంధువులు చేరుకుని కన్నీరుమున్నీరయ్యారు.
కారు పల్టీ, ఇద్దరు మహిళల మృతి