
కాంట్రాక్టు ఉద్యోగి.. కోటీశ్వరుడు
రాయచూరు రూరల్: కర్ణాటక గ్రామీణ మౌళిక సౌకర్యాల అభివృద్ధి మండలి (కెఆర్‌డిఎల్)లో కాంట్రాక్ట్ ఉద్యోగి అగర్భ శ్రీమంతుడయ్యాడు. లంచాలు, అవినీతి దీనికి కారణం. కొప్పళ జిల్లా కేంద్రంలో నెలకు రూ.15 వేల వేతనంతో పనిచేసే కాంట్రాక్ట్ పని ఉద్యోగి కళకప్ప నిడగుంది వ్యవహారం తెలిసి లోకాయుక్త అధికారులు దాడులు జరిపారు. కొప్పళ భాగ్య నగరలో 24 ఇళ్లు, భవనాలు, 6 స్థలాలు, తమ్ముడు, అతని భార్య పేరు మీద పెద్ద మొత్తంలో ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు. ఆఫీసులో కళకప్ప దూకుడును తట్టుకోలేక కొందరు అధికారులు లోకాయుక్తకు సమాచారం ఇచ్చారు. దీంతో బుధ, గురువారాల్లో సోదాలు చేపట్టారు. అతని ఇంటిలో లభించిన భారీ బంగారు నగలు, స్థిరాస్తులను చూసి అందరూ నోరెళ్లబెట్టారు. కొప్పళ జిల్లా యలబుర్గ తాలూకా బండిహాళ్‌కు చెందిన అతడు 20 ఏళ్ల కిందట ఈ ఉద్యోగంలో చేరాడు. ఆనాటి నుంచి అవినీతి అక్రమాలను ఆలంబనగా చేసుకున్నట్లు ఆరోపణలున్నాయి. ఈ మండలిలో రూ.72 కోట్ల నిధుల దు ర్వినియోగంలో ఇతని పాత్ర ఉన్నట్లు గుసగుసలున్నాయి. అరెస్టు చేసి విచారణ చేపట్టారు.
కొప్పళలో లోకాయుక్త దాడులు
24 ఇళ్లు, భారీగా బంగారం గుర్తింపు