
బాలికా హంతకునికి జీవితఖైదు
మైసూరు: బాలికను అపహరించి హత్య చేసిన కిరాతకునికి చామరాజనగర జిల్లా సెషన్స్ ఎఫ్‌టీఎస్‌సీ 1వ కోర్టు జీవిత ఖైదు శిక్ష విధించింది. వివరాలు.. చామరాజనగర జిల్లా హనూరు తాలూకా వడ్డరదొడ్డి సమీపంలోని గోడెన్స్ నగర నివాసి తంగరాజు దోషి. ఇతను భార్యను వదిలేశాడు. 2018లో ఓ బాలికను ప్రేమ, పెళ్లి అని మోసపుచ్చి కిడ్నాప్ చేశాడు. తర్వాత ఇనుప రాడ్డుతో కొట్టి బాలికను చంపి మృతదేహాన్ని ఇంట్లో వదిలి పరారయ్యాడు. ఈ ఘటనపై రామాపుర పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టి తంగరాజును బంధించి, కోర్టులో చార్జిషీట్ సమర్పించారు. కోర్టు జడ్జి ఎస్‌జే కృష్ణ తుది విచారణలో నేరారోపణలు రుజువు కావడంతో తంగరాజుకు జీవితఖైదు, రూ.25 వేల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. న్యాయ సేవా ప్రాధికారం నుంచి రూ.5 లక్షల పరిహారాన్ని బాలిక కుటుంబానికి అందించాలని ఆదేశించారు. ప్రభుత్వ వకీలు కే.యోగేష్ వాదనలు వినిపించారు.
మంత్రిపై హనీట్రాప్ ఉత్తిదే
● సీఐడీ నివేదిక
దొడ్డబళ్లాపురం: గత అసెంబ్లీ సమావేశాల్లో మంత్రి రాజన్న తనపై హనీట్రాప్ కుట్ర జరుగుతోందని చేసిన ఆరోపణల్లో నిజం లేదని సీఐడీ ప్రకటించింది. దర్యాప్తు చేసిన సీఐడీ అధికారులు ఐజీపీకి నివేదిక ఇచ్చారు. మంత్రి ఆరోపణల మీద ఎటువంటి సాక్ష్యాధారాలు లభించలేదని పేర్కొన్నారు.
ఓ యువతి, కొందరు తన ఇంటికి వచ్చేవారు, కుమారునికి ఫోన్ చేసేవారు, హనీట్రాప్‌లోకి లాగడానికి ప్రయత్నించారు అని రాజన్న అప్పట్లో ఆరోపించడం తెలిసిందే. ఇది రాజకీయ దుమారం లేపింది. చివరకు కాంగ్రెస్ హైకమాండ్ కూడా ఏం జరిగిందని ఆరా తీసింది. మంత్రుల మధ్య గొడవలే హనీట్రాప్ రచ్చకు దారితీసిందని ప్రచారం సాగింది.
క్వాంటమ్ రాజధానిగా
కర్ణాటక: సీఎం
బనశంకరి: రాష్ట్రంలో క్వాంటమ్ విధానం రూపొందించామని, ఈ రంగంలో భారీగా ఉద్యోగాల కల్పన లక్ష్యంగా పెట్టుకున్నామని సీఎం సిద్దరామయ్య తెలిపారు. గురువారం నగరంలోని ఓ హోటల్‌లో క్వాంటమ్ ఇండియా బెంగళూరు– 2025 సమ్మేళనాన్ని ప్రారంభించి మాట్లాడారు. కర్ణాటకలో క్వాంటమ్ ద్వారా 2035 లోగా లక్ష అధిక నైపుణ్య ఉద్యోగాలను సృష్టించి క్వాంటమ్ రాజధానిగా చేయాలనేది ఆశయమన్నారు. 20 బిలియన్ డాలర్ల క్వాంటమ్ ఆర్థిక వ్యవస్థను సృష్టించాలన్నదే లక్ష్యమని, ఇందుకోసం కర్ణాటక క్వాంటమ్ మిషన్ ప్రారంభించామని తెలిపారు. పరిశోధన, అభివృద్ధి కోసం రూ. వెయ్యి కోట్లు కేటాయించామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మంత్రి బోసరాజు, ఐటీ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.
టిక్‌టాకర్ నిర్బంధం
యశవంతపుర: జర్మనీకీ చెందిన ప్రముఖ టిక్‌టాక్ స్టార్ నోయెల్ రాబిన్సన్‌ను బెంగళూరు పోలీసులు గురువారం అదుపులోకి తీసుకున్నారు. నగరంలోని చర్చి స్ట్రీట్‌లో భారతీయ సాంస్కృతిక పండుగలో నృత్యం చేస్తుండగా చూడటానికి వందల మంది జనం గుమిగూడారు. ప్రజలు, వాహనాల సంచారానికి ఇబ్బంది కలిగించారని రాబిన్సన్‌ను బలవంతంగా అదుపులోకి తీసుకొని విచారించి వదిలేశారు. గతంలో కూడా ఓ ప్రముఖ పాప్ స్టార్ ప్రదర్శన ఇస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు.
ప్లాట్‌ఫారంపై ప్రసవం
యశవంతపుర: బెంగళూరు రైల్వే స్టేషన్‌లో అమృత అనే గర్భిణి ప్లాట్‌ఫారంపై ప్రసవించింది. సహ ప్రయాణికులు, ఆర్‌పీఎఫ్ సిబ్బంది సహకారంతో కాన్పు జరిగింది. నెలలు నిండిన గర్భిణి ఊరికి వెళ్లడానికి రైల్వేస్టేషన్‌కు రాగా ప్రసవవేదన ఆరంభమైంది. ఆస్పత్రికి తీసుకెళ్లే సమయం కూడా లేదు. ఆమెకు కొడుకు జన్మించాడు. తరువాత స్థానిక ఆస్పత్రిలో చేర్చారు.