
కావేరిపై ఏదీ కరుణ?
బోరుమంటున్న మండ్య
కృష్ణరాజ సాగర డ్యాం
మండ్య: కావేరి, ఉప నదులపైనున్న డ్యాములు డెడ్ స్టోరేజీకి చేరుకున్నాయి. వర్షాలు ఊపందుకోని పక్షంలో తమ గతేమిటని పరిసర ప్రాంతాల రైతులు, ప్రజల్లో దిగులు నెలకొంది. గత ఆరేళ్లతో పోలిస్తే కృష్ణరాజసాగర జలాశయంలో నీటి మట్టం ఈ సీజన్‌లో కనిష్టంగా మారింది. ప్రస్తుతం జలాశయంలో 80.25 అడుగుల నీరు మాత్రమే ఉంది. 2019లో ఇదే జలాశయంలో 81.88 అడుగుల నీటి మట్టం ఉంది. గత ఏడాది ఆశించిన మేర వర్షాలు కురవకపోవడంతో జలాశయంలో వెలవెలబోతోంది. సుప్రీంకోర్టు ఆదేశాలతో రాష్ట్ర ప్రభుత్వం తమిళనాడుకు నిరంతరాయంగా నీటిని జలాశయం నుంచి విడుదల చేస్తోంది. దీంతో డ్యాం పరిస్థితి ఇంకా తీసికట్టు అయ్యింది. ప్రస్తుతం కేఆర్‌ఎస్‌కు 1,560 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా, 155 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఎగువన కేరళ, అటవీ ప్రాంతాల్లో రుతు పవన వర్షాలు ఊపందుకుంటే కావేరి నదీ ప్రవాహం పెరిగే అవకాశముంది.
అదే మాదిరిగా కబిని
జిల్లాలోని హెచ్‌డీ తాలూకా బీచనహళ్లిలో కబిని జలాశయంలో నీటి ప్రమాణం రోజురోజుకి తగ్గిపోతోంది. గత వారం నుంచి జిల్లావ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. కబిని జలాశయానికి మాత్రం నీరు రావడం లేదు. జలాశయానికి నీరు రావాలంటే కేరళలో వర్షాలు పడాలి. కానీ అక్కడ వర్షం పడడం లేదు. ఈ నేపథ్యంలో వైనాడులో పుష్కలంగా వర్షాలు కురవాలని పరిసర ప్రాంతాల ప్రజలు ప్రార్థనలు చేస్తున్నారు. డ్యాం ప్రస్తుతం డెడ్ స్టోరేజీకి చేరింది.
కేఆర్‌ఎస్ డ్యాంలో క్షీణించిన నీటిమట్టం
రాబోయే వర్షాలపైనే ఆశలు