15 నిమిషాల్లో ఒకే కుటుంబానికి చెందిన నలుగురి హత్య!

- - Sakshi

కర్ణాటక: అందమైన బీచ్‌లు, దేవస్థానాలతో ప్రశాంతంగా ఉండే ఉడుపి నగరంలో ఘోరం చోటుచేసుకుంది, ఆదివారం ఉదయం ఒకే కుటుంబానికి చెందిన నలుగురు హత్యకు గురయ్యారు. వివరాలు ఇలా ఉన్నాయి, ఇంటి యజమాని నూర్‌ మహమ్మద్‌ దుబాయ్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. అతని భార్య హసీనా (45), కూతుళ్లు అఫ్నాన్‌ (23), ఆజ్నాన్‌ (21), కొడుకు అసీమ్‌ (14) ఉడుపిలో తృప్తినగరలో నివాసం ఉంటున్నారు.

వీరి పెద్ద కొడుకు అసాద్‌ బెంగళూరులో ఇండిగో ఎయిర్‌లైన్స్‌లో, అలాగే అఫ్నాన్‌ బెంగళూరులో ఎయిర్‌హోస్టెస్‌గా ఉద్యోగం చేస్తున్నారు. పండుగ సెలవులు రావడంతో అఫ్నాన్‌ రెండు రోజుల కిందట ఉడుపిలోని ఇంటికి వచ్చింది. ఆదివారం ఉదయం 8:20 గంటల సమయంలో 45 ఏళ్ల మధ్యవయస్కుడు మూతికి మాస్క్‌ ధరించి సంతెకట్టెకు వచ్చాడు, అక్కడి నుంచి ఆటో ఎక్కి తనను తృప్తినగరకు తీసుకెళ్లాలని ఆటోడ్రైవర్‌ శ్యామ్‌కు సూచించాడు. ఆ మేరకు అతన్ని తృప్తినగరలో దించాడు.


హత్యకు గురైన తల్లి హసీనా, ఆమె పిల్లలు (ఫైల్‌) 

నలుగురిని వెంటాడి పొడిచి
దుండగుడు వెంట తెచ్చుకున్న చాకుతో ఇంటిలోకి చొరబడి మారణహోమం సృష్టించాడు. ఎక్కడ ఉన్నవారిని అక్కడే పొడిచి, గొంతుకోసి హతమార్చాడు. వంట గది, బెడ్‌రూం, బాతురూం, హాల్‌లో ఒక్కొక్కరి శవాలు ఉండడమే దీనికి నిదర్శనం. హసీనా అత్తను వెంటాడగా ఆమె భయంతో బాతురూంలోకి వెళ్లి లాక్‌ చేసుకోవడంతో బతికి పోయింది. అసీమ్‌ సైకిల్‌ తొక్కుతూ ఇంటిలోకి వచ్చి దుండగున్ని చూసి కేకలు వేశాడు. దుండగుడు బాలున్ని హాల్‌లో పొడిచి చంపి పరారయ్యాడు.

15 నిమిషాల్లో దారుణం
కాగా హంతకుడు 15 నిముషాలలో పని ముగించుకొని మళ్లీ ఎవరో బైకులో వెళ్తుంటే సంతెకట్టకు డ్రాప్‌ తీసుకున్నాడు. సంతెకట్ట నుంచి ఎక్కడకు వెళ్లాడో జాడ లేదు. ఈ హత్యోదంతం క్షణాల్లోనే ఉడుపి అంతటా పాకిపోయింది. వందలాదిగా అక్కడికి చేరుకున్నారు. పోలీసులు వచ్చి జాగిలాలు, వేలిముద్రల నిపుణులు ఆధారాల కోసం గాలించారు.

బెంగళూరు యాసలో మాట్లాడాడు

► ఐదు పోలీసు బృందాలు మంగళూరు, శివమొగ్గ, కారవారకు వెళ్లాయి, రెండు బృందాలు ఉడుపిలో గాలిస్తున్నాయి.

► 45 ఏళ్ల వయసున్న హంతకుని సీసీ కెమెరా ఫొటోలు, వీడియోలను విడుదల చేశారు. నిందితుడు బెంగళూరు యాసలో కన్నడ మాట్లాడినట్లు ఆటో డ్రైవర్‌ శ్యామ్‌ చెప్పాడు.

► ఎయిర్‌ హోస్టెస్‌గా పని చేస్తున్న యువతిపై ద్వేషంతోనే హత్యాకాండకు పాల్పడి ఉండొచ్చని, లేదా పెద్ద కొడుకు పాత్ర ఉండవచ్చని అనుమానాలు ఉన్నాయి.

► పోలీసులు ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. జిల్లా ఎస్పీ, ఎమ్మెల్యే తదితరులు ఘటనాస్థలిని పరిశీలించారు.

►  దుబైలో ఉన్న మొహమ్మద్‌, బెంగళూరులో పెద్దకొడుకు అసాద్‌ చేరుకోగా సోమవారం సాయంత్రం కోడిబెంగ్రె జామియా మసీదులో అంత్యక్రియలను జరిపారు.

Read latest Karnataka News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top