
బస్టాండు సర్కిల్ వద్ద పూజలు నిర్వహిస్తున్న దృశ్యం
మాలూరు: తాలూకాలో మంచి వానలు కురిసి పంటలు బాగా పండి ప్రజలు సుఖ సంతోషంగా ఉండాలని కోరుతూ లక్కూరు గ్రామంలోని బస్టాండు వద్ద గ్రామస్తులు వివిధ పూజలను నిర్వహించారు. తాలూకాలో గత ఐదారేళ్ల నుంచి సరైన వానలు లేక, చెరువులు నిండక ప్రజలు, రైతులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. రైతులు విత్తనాలు వేయలేని పరిస్థితి నెలకొని ఉంది. వేసిన పంటలు వానలు లేక ఎండుతున్నాయి. ఇలాంటి సమయంలో ప్రజలు, రైతులు వానల కోసం దేవుడికి మొర పెట్టుకున్నారు. వానలు సరిగా లేకపోవడం వల్ల రాగుల ధరలు గగనానికి చేరుకున్నాయి. క్వింటాల్ ధర రూ.3500 చేరుకుంది. పూజల్లో గ్రామంలోని మహిళలు తలపై తంబిట్టు దీపాలను మోసుకొచ్చి గ్రామ దేవతలకు సమర్పించారు. ఆలయాల్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిగాయి.