కరీంనగర్ అర్బన్: రాష్ట్ర ప్రభుత్వ కార్మిక, ఉపాధి, శిక్షణ, కర్మాగారాల శాఖ ఆధ్వర్యంలోని తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ లిమిటెడ్ (టీవోయంసీవోయం) ద్వారా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో నిర్మాణ రంగంలో వివిధ ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ఉపాధి కార్యాలయం ప్రకటించింది. సదరు ఉద్యోగాలకు సంబంధించి జనరల్ హెల్పర్స్‌కు నెలకు రూ.27,080, షట్టరింగ్ కార్పెంటర్స్‌కు రూ.34,830, స్టీల్ ఫిక్సర్స్కు నెలకు రూ.34,830, మేషన్స్కు రూ.34,830 వేతనం ఉంటుందని తెలిపింది. అభ్యర్థుల వయస్సు 22–42 ఏళ్ల మధ్య ఉండాలని, కనీసం రెండేళ్ల అనుభవం ఉండాలని పేర్కొంది. కంపెనీయే ఉచిత వీసా, విమాన టికెట్, ఉచిత వసతి సౌకర్యం, రోజుకు మూడు పూటల ఉచిత భోజనం, ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తుందని వివరించారు. ఆసక్తి గల అభ్యర్థులు తమ పాస్‌పోర్టు నంబర్‌తో పాటు అవసరమైన వివరాలను ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా తెలియజేసి పేర్లను నమోదు చేసుకోవాలని కోరారు. వివరాలకు 08035524946, 040–23342040 నంబర్లను సంప్రదించాలని సూచించారు. జిల్లాలోని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఆర్టీసీ ప్రత్యేక ఫోన్ నంబర్లు
విద్యానగర్(కరీంనగర్): ఆర్టీసీ కరీంనగర్ రీజియన్ పరిధిలోని బస్ స్టేషన్లకు సంబంధించి అవసరమైన సమాచారాన్ని ప్రయాణికులకు అందజేయడానికి ప్రత్యేక ఫోన్ నంబర్లును అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ఆర్ఎం బి.రాజు తెలిపారు. గోదావరిఖని 94413 35701, పెద్దపల్లి 90631 56348, సుల్తానాబాద్ 94924 46028, హుస్నాబాద్ 73828 52772, హుజూరాబాద్ 73820 73005, జమ్మికుంట 83411 43730, జగిత్యాల 94933 10269, కరీంనగర్ 99592 25931, కోరుట్ల 73825 34960, మంథని 73828 25923, మెట్పల్లి 90105 73250, సిరిసిల్ల 73823 12927, వేములవాడ 73828 51729 నంబర్లలో సమాచారం కోసం సంప్రదించవచ్చని పేర్కొన్నారు.
ఉరేసుకొని విద్యుత్ శాఖ ఉద్యోగి ఆత్మహత్య
కరీంనగర్‌క్రైం: కడుపునొప్పి భరించలేక జీవితంపై విరక్తి చెందిన విద్యుత్ శాఖ ఉద్యోగి ఆదివారం ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. కరీంనగర్‌లోని మార్కండేయనగర్లో ఉంటున్న కుర్ర సంపత్(36) విద్యుత్ శాఖలో ఆపరేటర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. కొంతకాలంగా కడుపునొప్పితో బాధపడుతున్నాడు. ఈక్రమంలో ఆదివారం ఉదయం ఇంట్లోని సీలింగ్ ఫ్యాన్‌కు లుంగీతో ఉరేసుకున్నాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే కిందకు దించి ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. మృతుడికి భార్య, ముగ్గురు కొడుకులు ఉన్నారు.


