సిరిసిల్లటౌన్: ప్రమాదవశాత్తు కిందపడి ఓ వ్యక్తి మృతిచెందిన సంఘటన సోమవారం సిరిసిల్ల పట్టణంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు. బిహార్ రాష్ట్రానికి చెందిన అశోక్(48) చాలా రోజుల క్రిత కూలీ పనుల కోసం సిరిసిల్లకు వలస వచ్చాడు. స్థానిక బీవైనగర్‌లో ఒంటరిగా ఉంటూ కూలీ డబ్బులతో జీవితాన్ని వెళ్లదీస్తున్నాడు. ఈక్రమంలో సోమవారం మధ్యాహ్నం మద్యం సేవించి ఇంటికి వెళ్తుండగా వెంకంపేట రోడ్డులో తూలి కిందపడిపోయాడు. రాత్రి వరకు లేవకపోవడంతో పోలీసులకు సమాచారం అందించగా మృతదేహాన్ని సిరిసిల్ల మార్చురీకి తరలించారు.
వివాహిత
అనుమానాస్పద మృతి
ఇల్లందకుంట: మండలంలోని సిరిసేడు గ్రామంలో వివాహిత కావ్య (28) అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఎస్సై రాజ్‌కుమార్ తెలిపిన వివరాలు.. హుజూరాబాద్ మండలం నర్సింగపూర్ గ్రామానికి చెందిన బోయిని లింగయ్య కుమార్తె కావ్యకు, సిరిసేడుకు చెందిన రేణికుంట్ల రాజశేఖర్‌తో ఎనిమిదేళ్ల క్రితం ప్రేమ వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమార్తెలు రిహాన్షి, మ్యాగీ. సోమవారం తెల్లవారుజామున మూడు గంటల సమయంలో కావ్య రక్తం కక్కుకొని, కళ్లు తిరిగి కిందపడిపోయిందని, ఆసుపత్రికి తీసుకెళ్తున్నట్లు భర్త రాజశేఖర్ సమాచారం ఇచ్చాడని తండ్రి లింగయ్య ఫిర్యాదులో పేర్కొన్నాడు. కుటుంబ సభ్యులు ఆసుపత్రికి చేరుకునే సరికి కావ్య అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కుమార్తె మృతిపై అనుమానాలున్నాయంటూ తండ్రి ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై వివరించారు.


