ఎక్కువ మంది కోళ్ల పెంపకం అనగానే పౌల్ట్రీ ఫాం అని.. షెడ్డు వేయాలి. దాణా కావాలి. డాక్టర్‌కు చూపించాలి. అది అంతా ఓ పెద్ద కథ అని అనుకుంటారు. అవేమి అవసరం లేకుండానే ఆదాయం పెంచుకోవచ్చని సూచిస్తున్నారు నిపుణులు. చేను వద్ద ఎక్కువసేపు ఉండే రైతులు అక్కడే నాటు కోళ్లను పెంచుకోవచ్చు. ముందుగా ఓ నాలుగైదు నాటుకోళ్లను పెంచుకోవాలి. అవి గుడ్లు పెట్టాక పొదిగిస్తే కనీసం 50 పిల్లలవుతాయి. అక్కడే రెండు, మూడు చిన్న గూడులను కట్టిస్తే సరిపోతుంది. చేనులో పండే ధాన్యం, కాస్త మక్కలు వాటి కోసం కొంచెం పక్కన పెడితే సరిపోతుంది. ఇప్పుడు నాటుకోళ్లకు భలే గిరాకీ ఉంది. ఇష్టమున్నప్పుడు అమ్ముకుంటే చేతిలో డబ్బులుంటాయి.
రైతులకు పాలిచ్చే గేదె ఉంటే ఎకరం పొలం ఉన్నట్లే లెక్క అని నిపుణులు చెబుతున్నారు. పెద్దమొత్తంలో డెయిరీ ఫాంలు పెట్టాలంటే ఇబ్బందేమో కానీ రైతులు తమ శక్తికి సరిపడా రెండు, మూడు గేదెలతో కనీసం రూ.30వేలు సులువుగా పాలతో సంపాదించుకోవచ్చు. పంట పొలాల్లోని గడ్డిని తీసుకొచ్చి పాలు పితికే అలవాటుంటే గేదెలు ఆదాయ వనరులుగా పనికొస్తాయి. హోటళ్లలో, చుట్టు పక్కల వారికి పాలు పోస్తే రోజు లేదా నెలవారీగా చేతికి డబ్బులొస్తాయి.


