కరీంనగర్‌టౌన్: ‘అయ్యా.. ఒంట్లో సత్తువ ఉన్నంత వరకు కష్ట పడ్డాం. పిల్లలను పెద్ద చేశాం. సంపాదించింది సమానంగా పంచిచ్చాం. ఇప్పుడు వయసు మీద పడ్డది. ఒంట్లో ఓపిక కష్టపడేంత శక్తి లేదు. కొడుకులు బువ్వ పెడ్తలేరు. ఇంట్లో ఉండనిస్తలేరు. ఆస్తులు లాక్కుంటున్నారు’. అంటూ ఇలా అనేక సమస్యలతో ప్రతీ సోమవారం కరీంనగర్ కలెక్టరేట్‌లో జరిగే ప్రజావాణిలో పదుల సంఖ్యలో పండుటాకులు ఫిర్యాదు చేస్తున్నారు. అర్జీ స్వీకరిస్తున్న అధికారులు వృద్ధులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇస్తున్నారు. డివిజన్‌స్థాయిలో ట్రిబ్యునల్ ఏర్పాటు చేసి వయోవృద్ధుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.
మలిసంధ్యలో కష్టాలు
తల్లిదండ్రులను కొడుకులు రోడ్డుపై వదిలేస్తున్నా రు. జిల్లాలో ఇలాంటి ఘటనలు తరచూ వెలుగులోకి వస్తుండగా ప్రజావాణిలో ఫిర్యాదు చేసేవారి సంఖ్య పెరుగుతోంది. ఇలాంటి సమస్యలకు చెక్ పెడుతూ ప్రభుత్వం డివిజన్‌స్థాయిలో ఓ ట్రిబ్యునల్ ఏర్పాటు చేసింది. తల్లిదండ్రులను వీధిపాలు చేస్తే కొడుకులు కటకటాలు లెక్కించాల్సిందేనని హెచ్చరిస్తోంది. వృద్ధుల సంపూర్ణ బాధ్యత ఉన్నవారు ఎవరైనా అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తే 3 నెలల జైలుశిక్ష, రూ. 5 వేల జరిమానా విధిస్తోంది.
బతుకు భారం.. అధికారులే ఆధారం
ఆస్తి సంపాదించి ఇచ్చిన తల్లిదండ్రులకు తనయులు పట్టెడన్నం పెట్టడం లేదు. జీవిత చరమాంకంలో ఆదుకోవాల్సింది పోయి చేతులు దులుపుకుంటున్నారు. దీంతో జిల్లాలో చాలా మంది న్యాయం కోసం పోలీసుస్టేషన్లు, కోర్టులను ఆశ్రయిస్తున్నారు. ఈ క్రమంలో వృద్ధుల చట్టాలను పకడ్బందీగా అమలు చేసేందుకు కలెక్టర్ డివిజన్ల వారీగా ట్రిబ్యునల్ ఏర్పాటు చేశారు. డివిజన్ ప్రిసైడింగ్ అధికారిగా ఆర్డీవో వ్యవహరిస్తారు. వృద్ధుల సంఘం నుంచి ఒక ప్రతినిధి, కౌన్సెలేషన్ అధికారి ఉంటారు. డివిజన్ కార్యాలయంలో వృద్ధులు ఫిర్యాదు చేయవచ్చు. ఆర్డీవో సంబంధిత తహసీల్దార్‌కు విచారణ కోసం ఆదేశిస్తారు. ఇరు వర్గాలను పిలిచి వాదనలు విని న్యాయం చేస్తారు. వినని పక్షంలో కౌన్సెలేషన్ అధికారికి అనుసంధానం చేస్తారు. ఒకవేళ న్యాయం జరగలేదని భావిస్తే జిల్లా అప్పిలేట్ అధికారి కలెక్టర్‌ను ఆశ్రయించవచ్చు.
పోషణ సంక్షేమ చట్టం 2007
తల్లిదండ్రులు, వయోవృద్ధుల పోషణ సంక్షేమ చట్టం–2007 పకడ్బందీగా అమలయ్యేలా కలెక్టర్ పర్యవేక్షిస్తున్నారు. కన్నవారిని విస్మరిస్తే జైలు కూడు తప్పదని హెచ్చరిస్తున్నారు. సొంత సంపాదనతో తమను తాము పోషించుకోలేని వృద్ధులకు నెలకు రూ.10 వేలకు మించకుండా పోషణ నిమిత్తం పిల్లల నుంచి పొందవచ్చు.
సాయం కోసం సంప్రదించండి
జిల్లాకేంద్రంలోని హెల్ప్‌లైన్ నంబర్ 14567
చైల్డ్ హెల్ప్‌లైన్ 1098
ఉమెన్ హెల్ప్‌లైన్ 181
(ఆర్డీవోకు నేరుగా ఫిర్యాదు చేయవచ్చు)
‘వృద్ధులైన తల్లిదండ్రుల సంరక్షణకు అందాల్సి న నెలవారీ భరణం సకాలంలో అందేలా అధి కారులు పర్యవేక్షించాలి. తల్లిదండ్రులకు కోర్టు లేదా ఆర్డీవో నుంచి ప్రతినెలా నిర్దేశించిన మొ త్తాన్ని వారసులు ఆలస్యం లేకుండా చెల్లించేలా పర్యవేక్షించాలి. భరణం అందకపోతే పిల్లలు, వారసులతో నిర్దేశించిన మొత్తాన్ని ఇప్పించాలి.
– ఇటీవలి సమావేశంలో ఆర్డీవో షర్మిల
జిల్లావ్యాప్తంగా వచ్చిన ఫిర్యాదులు
ఏడాది ఫిర్యాదులు
2023 117
2024 129
2025 147
2026 63(ఇప్పటి వరకు)
ఫిర్యాదు చేస్తే చర్యలు
మలి వయసులో తల్లిదండ్రులకు వారసులు తోడుగా ఉండాలి. అనవసరంగా ఫిర్యాదుల వరకు తెచ్చుకోకూడదు. వృద్ధులు కూడా తప్పుడు ఫిర్యాదులు చేస్తే ఉపేక్షించం. పిల్లల ఆదరణకు నోచుకోని బాధితులు నేరుగా, పోస్టు ద్వారా, ఆర్టీవో అధ్యక్షతన ఏర్పాటయ్యే వృద్ధుల సంక్షేమ కమిటీలకు, 14567 టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదు చేయవచ్చు.
– ఎం.సరస్వతి, మహిళా శిశుసంక్షేమ, వయోవృద్ధులశాఖ జిల్లా అధికారి


