పర్మిషన్లకు డబ్బులు డిమాండ్‌ చేయొద్దు | - | Sakshi
Sakshi News home page

పర్మిషన్లకు డబ్బులు డిమాండ్‌ చేయొద్దు

Nov 2 2026 12:05 AM | Updated on Nov 2 2026 12:05 AM

భూ వ్యవహారాల్లో తలదూర్చొద్దు

అలాంటివారిని బ్లాక్‌లిస్టులో పెడతా

పార్టీపై లూజ్‌ కామెంట్స్‌ చేసినా సహించేది లేదు

కేంద్ర మంత్రి బండి సంజయ్‌కుమార్‌

కరీంనగర్‌: నగరపాలక పరిధిలో ఇంటి నిర్మాణ అనుమతులు, భూ వ్యవహారాల్లో అవినీతి ఆరోపణలు వస్తే ఎంతటివారినైనా ఉపేక్షించేది లేదని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్‌కుమార్‌ హెచ్చరించారు. పర్మిషన్ల కోసం డబ్బులు డిమాండ్‌ చేసినా, భూ వ్యవహారాల్లో తలదూర్చినా సంబంధిత కార్పొరేటర్లను బ్లాక్‌లిస్టులో పెడతానని స్పష్టం చేశారు. కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు ఫంక్షన్‌హాల్‌లో నిర్వహించిన అసెంబ్లీ నియోజకవర్గ బీజేపీ నేతల సమావేశంలో కొందరు కార్పొరేటర్లు, నాయకుల తీరుపై ఆయన తీవ్రస్థాయిలో మండిపడినట్లు తెలిసింది. కొందరు కార్పొరేటర్లు ఇంటి నిర్మాణ అనుమతుల కోసం డబ్బులు వసూలు చేస్తున్నారని, షాపుల వద్దకు వెళ్లి కలెక్షన్లు చేస్తున్నారని తన దృష్టికి వచ్చిందన్నారు. ఇకపై ఇలాంటి వ్యవహారాలను సహించేది లేదని, పార్టీ క్రమశిక్షణ, నిజాయితీకి విరుద్ధంగా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. ఇంటి యజమానికి ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా అనుమతులు ఇప్పించి సాయం చేస్తే జీవితాంతం గుర్తుంచుకుంటారని, అదే డబ్బులు వసూలు చేస్తే ఎన్నికల్లో ఓట్లు ఎలా వస్తాయని ప్రశ్నించారు. గెలిచిన తర్వాత కొందరు కార్పొరేటర్లు పార్టీ కార్యక్రమాలను పట్టించుకోవడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో పార్టీ చేసిన సయాన్ని గుర్తుచేసుకుని ఆత్మవిమర్శ చేసుకోవాలని, పార్టీ తనకేమిచ్చిందని కాకుండా పార్టీ కోసం తానేం చేశానని ఆలోచించాలని సూచించారు. తమ డివిజన్లలో ప్రజల మధ్య ఉంటూ పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తే పార్టీనే గుర్తించి గౌరవిస్తుందని పేర్కొన్నారు. పార్టీ తనను కార్యక్రమాలకు పిలవడం లేదంటూ విమర్శలు చేయడం, పార్టీపై లూజ్‌ కామెంట్స్‌ చేయడం సరికాదన్నారు. పార్టీ ఎవరి కోసం ఆగదని, పార్టీని విమర్శించినా, బ్లాక్‌మెయిల్‌ ధోరణితో వ్యవహరించినా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. మేయర్‌ కొలగాని శ్రీనివాస్‌, డిప్యూటీ మేయర్‌ యాదగిరి సునీల్‌రావు, మాజీ మేయర్‌ డి.శంకర్‌, బాస సత్యనారాయణ, నల్లాల ఓదెలు, కోమాల ఆంజనేయులు, గుజ్జ శ్రీను, రమేశ్‌, బోయినిపల్లి ప్రవీణ్‌రావు, రాజేంద్రప్రసాద్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement