కోరుట్లటౌన్: సౌదీ అరేబియాలోని రియాద్‌లో 20 రోజుల క్రితం గుండెపోటుతో మృతి చెందిన కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామానికి చెందిన ద్యావనపల్లి సాయిప్రసాద్(38) మృతదేహం ఆదివారం స్వగ్రామానికి చేరింది. సాయిప్రసాద్ ఉపాధి కోసం సౌదీ అరేబియా వెళ్లి పని చేసుకుంటున్నాడు. 20 రోజుల క్రితం బాత్‌రూంలో స్నానం చేస్తుండగా గుండెపోటుతో మృతి చెందినట్లు సోదరుడు విజయ్‌కుమార్ తెలిపారు. సాయిప్రసాద్ మృతితో భార్య, ఇద్దరు కుమారులు విషా దంలో మునిగిపోయారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం రూ.5 లక్షలు ఎక్స్‌గ్రేషియా అందించి ఆదుకోవాలని బంధువులు విజ్ఞప్తి చేశారు.
మహిళ మెడలోంచి
పుస్తెలతాడు చోరీ
తిమ్మాపూర్: బైక్ పై భర్తతో కలిసి ఇంటికి వెళ్తున్న ఓ మహిళ మెడలోని పుస్తెలతాడును ఇద్దరు గుర్తు తెలియని దుండగులు లాక్కెళ్లిన ఘటన ఆదివారం సాయంత్రం తిమ్మాపూర్ మండల కేంద్రంలోని మిర్చి యార్డ్ వద్ద ఘటన చోటు చేసుకుంది. మండలంలోని రామకష్ణ కాలనీ ఉపజ్ఞ హోమ్స్ కు చెందిన చుంచు లక్ష్మి తన భర్త శ్రీనివాస్ తో కలిసి ఎల్‌ఎండీ కాలనీకి వెళ్లి తిరిగి ఇంటికి బైక్ పై బయలుదేరారు. తిమ్మాపూర్ స్టేజీ సమీపంలోని మిర్చియార్డ్ ముందుకు రాగానే వెనుక నుంచి వేగంగా వచ్చిన బైక్ వచ్చిన దుండగులు, లక్ష్మి మెడలో ఉన్న పుస్తెలతాడును ఒక్కసారిగా బలంగా లాగి పరారయ్యారు.దాడితో బైక్ అదుపుతప్పి భార్యాభర్తలు కిందపడబోయారు. వెంటనే తేరుకున్న లక్ష్మీ గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు అక్కడికి చేరుకునేలోపు దుండగులు వేగంగా పారిపోయారు. ఈ ఘటనలో సుమారు అర్ధ తులం బంగారు పుస్తెలు చోరీకి గురైనట్లు బాధితురాలు తెలిపింది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై అరుణ్ తెలిపారు.


