పాల ఉత్పత్తి పెంచే దేశీయ ఆవులు | - | Sakshi
Sakshi News home page

పాల ఉత్పత్తి పెంచే దేశీయ ఆవులు

Nov 2 2026 12:05 AM | Updated on Nov 2 2026 12:05 AM

● గిర్‌, సాహివాల్‌, పుంగనూర్‌ ఆవుల

పెంపకానికి రైతుల మొగ్గు

● దేశీయ ఆవుల పాలకు పట్టణాల్లో

ఫుల్‌ డిమాండ్‌

జగిత్యాలఅగ్రికల్చర్‌: రైతులు వ్యవసాయంతోపాటు పాడి పరిశ్రమ వైపు అడుగులు వేస్తున్నారు. డెయిరీఫారాలకు బ్యాంకులు రుణాలు ఇస్తుండటంతో చదువుకున్న యువ రైతులు ముందుకొస్తున్నారు. పాలకు లీటర్‌కు రూ.80 నుంచి రూ.100 వరకు రేటు పలుకుతుండటంతో ఆవులకు డిమాండ్‌ ఏర్పడింది. ఇప్పటివరకు హైబ్రిడ్‌ ఆవులతో పాల వ్యాపారం చేసిన రైతులు, కొత్తగా డెయిరీఫారాలు పెట్టే రైతులు దేశీయ ఆవుల కొనుగోలుకు మొగ్గు చూపుతున్నారు. జిల్లా పశు సంవర్థక శాఖ దేశీయ ఆవులను రైతు సదస్సులో ప్రదర్శనగా పెడుతూ రైతుల దృష్టిని ఆకర్షిస్తున్నారు.

దేశీ ఆవులకు డిమాండ్‌ ఎందుకంటే..

దేశీ ఆవులు ఇచ్చే పాలకు మార్కెట్‌లో చాలా డిమాండ్‌ ఉంది. సాధారణ పాల కంటే ఎక్కువ ధర కూడా పలుకుతుంది. పాలతో పాటు నెయ్యికి సైతం విపరీతమైన మార్కెటింగ్‌ ఉంది. జిల్లాలో వేసవి ఉష్ణోగ్రతలను తట్టుకునే సామర్థ్యం గలవి కావడంతో రైతులు దేశీయ ఆవుల వైపు ఆకర్షితులవుతున్నారు. దీనికి తోడు, దేశీ ఆవులకు వ్యాది నిరోధక శక్తి ఎక్కువగా ఉండి, ఎక్కువగా రోగాల బారిన పడే అవకాశం లేదు. దేశీయ ఆవుల పాలకే కాకుండా ఆవులు విసర్జించే పేడ, మూత్రానికి సైతం భారీ డిమాండ్‌ ఉంది. దేశీయ ఆవుల పేడ, మూత్రంతో జీవామృతం, ఘనామృతం తయారు చేసి పంటలకు వాడుతూ, రసాయన ఎరువుల ఖర్చులను తగ్గించుకునే వెసులుబాటు ఉంది. అలాగే, వీటికి ప్రతి రోజు పచ్చిమేత అవసరం లేదు. ఎండుగడ్డి వంటి సాధారణ మేత సరిపోతుంది. వీటికి హైబ్రిడ్‌ ఆవుల వలే ఖరీదైన దాణా అవసరం లేదు.

దేశీ ఆవుల్లో మూడు రకాలపై దృష్టి..

దేశీ ఆవుల్లో రైతులు మూడు రకాల ఆవులపై ప్రధానంగా దృష్టి పెడుతున్నారు. గిర్‌, సాహివాల్‌, పుంగనూర్‌ ఆవులు అధికంగా పాల దిగుబడిని ఇవ్వడంతో పాటు స్థానిక వాతావరణ పరిస్థితులను తట్టుకుంటాయి. ఇప్పటికే జిల్లాలో పొలాస, లక్ష్మీపూర్‌, మెట్‌పల్లి, బీర్పూర్‌ తదితర ప్రాంతాల్లో కొంతమంది అభ్యుదయ రైతులు దేశీయ ఆవులను పెంచుతున్నారు. పుంగనూర్‌ ఆవు.. ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా పుంగనూర్‌కు చెందిన స్థానిక ఆవు. ఇది దక్షిణ భారతదేశంలో గొప్ప స్వదేశీ ఆవు. ఈ ఆవును మంచిగా పెంచితే రోజుకు 4–5 లీటర్లు పాలు ఇస్తుంది.

గిర్‌ ఆవు... గుజరాత్‌ రాష్ట్రంలోని గిర్‌ ప్రాంతంలోని ఆవు. గోధుమ రంగు మచ్చలతో చూడడానికి బాగుంటుంది. రోజుకు సగటున 8–15 లీటర్ల పాలు ఇస్తుంది.

సాహివాల్‌ ఆవు.. పంజాబ్‌, హర్యానా, రాజస్థాన్‌, ఉత్తరప్రదేశ్‌లో ఈ ఆవులు ఎక్కువ. పాల దిగుబడి రోజుకు సగటున 10–15 లీటర్లు ఉంటుంది. రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉండి, రోగాలు రావు.

దేశీ ఆవులపై పశుసంవర్థక శాఖ ఫోకస్‌

దేశీ ఆవులపై జిల్లా పశు సంవర్థక శాఖ ప్రత్యేక ఫోకస్‌ పెడుతోంది. దేశీ ఆవుల సంతతిని పెంచేందుకు నేషనల్‌ ఆర్టిఫీషియల్‌ ఇన్‌సెమినేషన్‌ కింద నాణ్యమైన దేశీ జాతుల వీర్యంతో కృత్రిమ గర్భధారణ చేయిస్తున్నారు. దీనిద్వారా పుట్టే దూడలు అధిక రోగ నిరోధక శక్తితో పాటు ఎక్కువ పాల దిగుబడినిచ్చే సామర్థ్యంతో పెరుగుతాయి. పశువుల ఆరోగ్య సంరక్షణ కోసం ఆయా పశువైద్యశాలల్లో పశువైద్యులు, వెటర్నరీ అసిస్టెంట్‌ అందుబాటులో ఉన్నారు. గ్రామాల్లో పశు సేవలు అందించేందుకు గోపాలమిత్రలను నియమించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement