పండుగపూట వేతన వెతలు! | - | Sakshi
Sakshi News home page

పండుగపూట వేతన వెతలు!

Oct 18 2026 1:42 AM | Updated on Oct 18 2026 1:42 AM

జీపీ కార్మికులకు రెండు నెలలుగా అందని జీతాలు

పండుగకు అప్పులు చేస్తున్న వైనం

నిధుల కొరతతో ఇబ్బందులు

జీతాలు చెల్లించాలని డిమాండ్‌

కరీంనగర్‌ టౌన్‌: ఇరుగుపొరుగు కుటుంబాలు బతుకమ్మ, దసరా సంబరాలకు సిద్ధమవుతుంటే.. గ్రామాలను పరిశుభ్రంగా ఉంచే పారిశుధ్య కార్మికులు, మల్టీపర్పస్‌ వర్కర్లు, కారోబార్లు, ఉపాధి హామీ ఫీల్డ్‌ అసిస్టెంట్లు తమకు రావాల్సిన జీతాల కోసం ఎదురుచూస్తున్నారు. పండుగ కోసం చేయిచాయి అప్పు చేస్తున్నారు. జిల్లాలోని 316 గ్రామపంచాయతీల్లో 1,460 మంది జీపీ కార్మికులు ఉన్నారు. 683 మంది స్కావెంజర్లు, 240 మంది కారోబార్లు ఉండగా.. రెండు, మూడు నెలలుగా వేతనాల కోసం ఎదురుచూస్తున్నారు.

భారంగా కుటుంబ పోషణ

గ్రామాల్లో పారిశుధ్య కార్మికులు, వాటర్‌మెన్లు, ఎలక్ట్రీషియన్లు, ట్రాక్టర్‌ డ్రైవర్లు, కారోబార్లు విధులు నిర్వహిస్తున్నారు. ఒక్కో పంచాయతీలో సగటున నలుగురు కార్మికులు పనిచేస్తుండగా, ఒక్కొక్కరికి నెలకు రూ.9,500 చొప్పున వేతనం చెల్లిస్తున్నారు. రెండు నెలలుగా వేతనాలు అందకపోవడంతో కుటుంబపోషణ భారంగా మారింది. గ్రామాల్లో పారిశుధ్యం, తాగునీటి సరఫరా, ఇతర అత్యవసర పనుల్లో కీలకంగా వ్యవహరిస్తున్నా.. జీతాల విషయంలో ఎదురుచూపు తప్పడం లేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

నిధుల కొరతతో..

గ్రామపంచాయతీలకు కేంద్ర ఆర్థిక సంఘం ద్వారా జనాభాకు ఒక్కొక్కరికి రూ.166 చొప్పున నిధులు రావాల్సి ఉండగా, ప్రస్తుతం రూ.115 చొప్పున మాత్రమే అందుతున్నాయని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ లెక్కన జిల్లాకు నెలకు సుమారు రూ.8.75 కోట్ల నిధులు రావాల్సి ఉంది. వీటికి అదనంగా ఎస్సీ సబ్‌ప్లాన్‌ కింద రూ.1.05 కోట్లు, ఎస్టీ సబ్‌ప్లాన్‌ కింద రూ.62 లక్షలు, రాష్ట్ర ఆర్థిక సంఘం నిధులు రావాల్సి ఉంది. అవి అందకపోవడంతో పంచాయతీలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. నిధులు సకాలంలో విడుదల కాకపోవడంతో రెండు నెలల వేతన బకాయిలు సుమారు రూ.6 కోట్లకు చేరినట్లు అంచనా. దీంతో పంచాయతీల్లో ట్రాక్టర్ల ఈఎంఐలు, తాగునీటి పైప్‌లైన్ల మరమ్మతులు, ఇతర అత్యవసర పనులకు కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కొన్ని చోట్ల పంచాయతీ కార్యదర్శులే తమ సొంత డబ్బులతో కార్మికులకు వేతనాలు చెల్లించాల్సి వస్తోంది.

683 మంది స్కావెంజర్లకు మూడు నెలల బకాయిలు

ప్రభుత్వ పాఠశాలల్లో పారిశుధ్య పనులు నిర్వహిస్తున్న 683 మంది స్కావెంజర్ల పరిస్థితి దయనీయంగా ఉంది. వీరికి మూడు నెలలుగా వేతనాలు అందాల్సి ఉంది. విద్యార్థుల సంఖ్య ఆధారంగా నెలకు రూ.3 వేల నుంచి రూ.15 వేల వరకు వేతనాలు చెల్లిస్తున్నారు. పండుగ సమయంలో కుటుంబ అవసరాలు తీర్చుకోవడం కష్టంగా మారిందని స్కావెంజర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా పనిచేస్తున్న 240 మంది కారోబార్లకు మూడు నెలలుగా వేతనాలు అందాల్సి ఉంది. ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న ఫీల్డ్‌ అసిస్టెంట్లకు సైతం వేతనాల చెల్లింపులో జాప్యం జరుగుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement