కరీంనగర్అర్బన్: ఎల్నినో పరిస్థితులను ఎదుర్కొనేందుకు అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ చిత్రామిశ్రా ఆదేశించారు. తాగునీటి సరఫరాకు ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక దృష్టిసారించాలని, విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. గురువారం ఐడీఓసీలోని కలెక్టర్ చాంబర్లో అదనపు కలెక్టర్ డి.శ్రీనివాస్రెడ్డితో కలిసి జిల్లాస్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించారు. రిజర్వాయర్లలో నీటిమట్టాలను ఇరిగేషన్ అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. తాగునీటి అవసరాలకు సరిపడా నీరు అందుబాటులో ఉండేలా ముందస్తు చర్యలు తీసుకోవాలని, నీటి సరఫరాకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆదేశించారు. విద్యుత్ సరఫరాకు ఆటంకాలు ఏర్పడకుండా సంబంధిత అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. వ్యవసాయ అవసరాలు, నీటి సరఫరా వంటి కీలక అంశాలను దృష్టిలో ఉంచుకుని శాఖల వారీగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. ఎల్నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని చేపట్టాల్సిన చర్యలపై వచ్చే గురువారం మరోసారి సమీక్ష నిర్వహిస్తానని కలెక్టర్ తెలిపారు. అప్పటిలోగా ప్రతి శాఖ అధికారి సమగ్ర కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసుకుని రావాలని ఆదేశించారు.


