సభకు తీసుకెళ్లి పైసలు ఎగ్గొడతారా? | - | Sakshi
Sakshi News home page

సభకు తీసుకెళ్లి పైసలు ఎగ్గొడతారా?

Oct 3 2026 12:14 AM | Updated on Oct 3 2026 12:14 AM

● సీఎం సభ డబ్బుల పంచాయితీ

● నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేసిన మహిళలు

● ఒప్పుకున్న ప్రకారం డబ్బులు ఇవ్వాలని డిమాండ్‌

● రాజన్న సిరిసిల్ల జిల్లాలో మహిళల ఆందోళన

● డబ్బుల కోసం నాయకుల నిలదీత

ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో సీఎం రేవంత్‌రెడ్డి సభకు రావాలని కోరుతూ గ్రామంలో కాంగ్రెస్‌ నాయకులు సభకు వచ్చిన మహిళలకు డబ్బులు పంపిణీ చేశారు. ఇందులో కొంతమందికి డబ్బులు రాకపోవడం పైసల పంచాయితీకి దారితీసింది. దీంతో సదరు మహిళలు శుక్రవారం ఆందోళనకు దిగారు. తమకు డబ్బులు ఇవ్వని వారు నాశనమైపోతారని శాపనార్థాలు పెట్టారు. డబ్బుల కోసం స్థానిక నాయకులను నిలదీశారు. వివరాలు ఇలా ఉన్నాయి.. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్లతిమ్మాపూర్‌ గ్రామంలో సీఎం మీటింగ్‌కు వచ్చిన మహిళలకు రూ.500 చొప్పున డబ్బులు ఇస్తామని కాంగ్రెస్‌ నాయకులు చెప్పారు. నాయకుల మాటలు నమ్మిన మహిళలు కూలీ పనులు వదులుకొని సభకు తరలివెళ్లారు. సభకు వెళ్లినవారిలో సగం మందికి రూ.500 చొప్పున డబ్బు ఇవ్వగా, మరికొంతమందికి డబ్బులు అందకపోవడంతో నాయకులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పనులు వదులుకొని సభకు వస్తే డబ్బులు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేయడం దారుణమని వాపోయారు. డబ్బులు ఏగ్గొట్టిన నాయకులతోపాటు సీఎంపై మన్ను ఎత్తిపోయడం విశేషం. పైనుంచి డబ్బులు వచ్చినా స్థానిక కాంగ్రెస్‌ నాయకులు కాజేశారని మహిళలు ఆరోపించారు. రోజంతా తిండి లేకుండా పనులు వదులుకొని సభకు వెళ్లిన తమను మోసం చేసిన నాయకులు నాశనమైపోతారని శాపనార్థాలు పెట్టారు. ఈ ఘటన జిల్లాలో కలకలం రేపగా, స్థానికంగా నాయకుల తీరు చర్చనీయాంశంగా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement