కరీంనగర్‌కల్చరల్: పునాది సాంస్కృతిక నేపథ్యం, సామాజిక తాత్త్వికత నుంచి కందుకూరి అంజయ్య కవిత్వ సంపుటి అదనపు కణజాలం పురుడు పోసుకుందని ప్రముఖ జానపద సాహిత్య పరిశోధకుడు ఆచార్య జయధీర్ తిరుమలరావు అన్నారు. తెలంగాణ రచయితల వేదిక జిల్లా శాఖ, కరీంనగర్ ఫిలిం సొసైటీ, అంబేడ్కర్–ఫూలే–పెరియార్ అధ్యయన వేదికల సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం కరీంనగర్‌లోని ఫిలిం సొసైటీ భవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో అదనపు కణజాలం కవితా సంపుటిని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జయధీర్ తిరుమలరావు మాట్లాడుతూ సాంస్కృతిక మూలాల నుంచి సృజన చేసే కవులే సాహిత్య చరిత్రలో నిలి చిపోతారని అన్నారు. కవిత్వ సంపుటి సమీక్షకుడు కూకట్ల తిరుపతి మాట్లాడుతూ అదనపు కణజాలంలో ఆధిపత్య ప్రతిఘటనవాదం, ఉపసమూహాల ఉద్యమవాదం ప్రధానంగా కనిపిస్తాయని అన్నారు. తెరవే అధ్యక్షుడు సీవీ కుమార్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు కొండి మల్లారెడ్డి, కార్యదర్శి బూర్ల వెంకటేశ్వర్లు, తోట నిర్మలారాణి, పండుగ రత్నయ్య తదితరులు ప్రసంగించారు. కందుకూరి అంజయ్య ఈ పుస్తకాన్ని ప్రముఖ చలనచిత్ర విమర్శకుడు పొన్నం రవిచంద్రకు అంకితం చేశారు. కార్యక్రమంలో నలిమెల భాస్కర్, మచ్చ హరిదాసు, జూకంటి జగన్నాథం, దేవి యాదగిరి, అన్నవరం దేవేందర్, పీఎస్ రవీంద్ర, ఎర్రోజు వెంకటేశ్వర్లు, మహమూద్ పాషా, మాడిశెట్టి గోపాల్, సంకెపల్లి నాగేంద్రశర్మ, గుండు రమణయ్య, బాలసాని కొమురయ్య, తడిగొప్పుల కుమారస్వామి, కనకం శ్రీనివాస్, నెరువట్ల చైతన్య, కందుకూరి సహచరి సుహాసిని పాల్గొన్నారు.


