● రాష్ట్రస్థాయి పోటీల్లో వరుసగా 17వ సారి ఓవరాల్ చాంపియన్ ● రెండు దశాబ్దాలుగా తిరుగులేని ఆధిపత్యం
కరీంనగర్‌స్పోర్ట్స్: రాష్ట్రస్థాయి యోగాసన క్రీడల్లో కరీంనగర్ జిల్లా మరోసారి తన ఆధిపత్యాన్ని చాటుకుంది. 13వ రాష్ట్రస్థాయి సబ్‌జూనియర్, జూనియర్ యోగాసన పోటీల్లో ప్రతిభ కనబరిచి ఓవరాల్ చాంపియన్‌షిప్‌ను సొంతం చేసుకొని వరుసగా 17వసారి చాంపియన్‌గా నిలిచింది. దాదాపు రెండు దశాబ్దాలుగా యోగా క్రీడల్లో తిరుగులేని శక్తిగా ఎదిగిన కరీంనగర్ రాష్ట్ర యోగా పటంలో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకుంది.
2009 నుంచి విజయాల పరంపర
కరీంనగర్ యోగా ప్రస్థానం ఒక్కరోజులో ఏర్పడింది కాదు.. సంవత్సరాల తరబడి సాగిన సాధన, క్రమశిక్షణ, శిక్షణ ఫలితంగా కరీంనగర్ జిల్లా రాష్ట్రంలో అగ్రస్థానానికి చేరుకుంది. 2007–08లో నిజామాబాద్‌లో జరిగిన పోటీల్లో ద్వితీయ స్థానంతో ప్రారంభమైన ప్రయాణం 2009–10లో హైదరాబాద్‌లో తొలిసారి ప్రథమ స్థానాన్ని సాధించడంతో కొత్త మలుపు తిరిగింది. ఆ తర్వాత పలు వేదికల్లో ప్రతిభను కొనసాగిస్తూ కరీంనగర్ వరుస విజయాలను నమోదు చేసింది. మధ్యలో 2012–13లో వర్ధన్నపేటలో జరిగిన పోటీల్లో తృతీయ స్థానానికి పరిమితమైనా, ఆ తర్వాత మరింత పట్టుదలతో పుంజుకుంది. 2013–14 నుంచి వరుసగా ప్రథమ స్థానాలను సాధిస్తూ తన ఆధిపత్యాన్ని చాటింది. తాజాగా 2026–27లోనూ చాంపియన్‌గా 17వసారి నిలిచింది.
ఆతిథ్యమూ.. ఆధిపత్యమూ
కరీంనగర్‌లో 1993లో జిల్లా యోగా అసోసియేషన్ ఏర్పాటైంది. 2004లో తొలిసారిగా రాష్ట్రస్థాయి యోగా పోటీలకు జిల్లా ఆతిథ్యమిచ్చింది. అనంతరం 2017–18, 2018–19, 2021–22, 2023–24 సంవత్సరాల్లోనూ రాష్ట్రస్థాయి పోటీలకు వేదికగా నిలిచింది. తాజాగా 2026–27లో మరోసారి రాష్ట్రస్థాయి పోటీలకు ఆతిథ్యమివ్వడంతో పాటు విజేతగా నిలవడం విశేషం. మొత్తంగా 17 సార్లు చాంపియన్‌గా, 2 సార్లు ద్వితీయ చాంపియన్‌గా, ఒకసారి తృతీయ చాంపియన్‌గా నిలిచింది.
విజయ పరంపర కొనసాగిస్తాం
కరీంనగర్ జిల్లా యోగాసన క్రీడల్లో వరుసగా 17వసారి ఓవరాల్ చాంపియన్‌గా నిలవడం గర్వకారణం. క్రీడాకారుల నిరంతర సాధన, కోచ్‌ల కృషి,, సంఘం ప్రణాళికాబద్ధమైన శిక్షణే ఈ విజయానికి ప్రధాన కారణం. రాష్ట్రస్థాయి విజయాలను జాతీయ, అంతర్జాతీయ స్థాయిలోనూ కొనసాగించేలా క్రీడాకారులను ప్రోత్సహిస్తాం.
– నాగిరెడ్డి సిద్దారెడ్డి,
యోగా సంఘం కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు


