ధర్మపురి: ధర్మపురి శ్రీలక్ష్మీనృసింహస్వామి ఆలయంలో వివిధ రకాల పనుల నిమిత్తం ఉపయోగపడేలా హైదరాబాద్‌కు చెందిన దంపతులు ఆశీష్ కులకర్ణి, కవిత దంపతులు మారుతీ సుజుకీ వాహనాన్ని బుధవారం బహూకరించారు. కారు విలువ సుమారు 6.50లక్షలు ఉంటుందని దంపతులు తెలిపారు. ముందుగా వాహనానికి ప్రత్యేక పూజలు చేసి ప్రారంభించారు. దంపతులకు స్వామివారి శేషవస్త్రం, ప్రసాదాలు అందించారు. కార్యక్రమంలో ఆలయ ఈవో శ్రీనివాస్, సూపరింటెండెంట్ శ్రీనివాస్, అర్చకులు, సిబ్బంది తదితరులున్నారు.
బైక్, కారు ఢీ.. ఒకరి దుర్మరణం
మానకొండూర్: ఓ రైతు తన ద్విచక్రవాహనం టీవీఎస్ ఎక్సెల్‌పై వెళ్తుండగా.. కరీంనగర్ నుంచి వరంగల్‌కు వస్తు న్న కారు ఢీకొనడంతో మృతిచెందాడు. స్థానికుల వివరాల ప్రకారం.. చెంజర్ల గ్రామానికి చెందిన గొల్లెన మొండయ్య(55) అనే రైతు బుధవారం వ్యవసాయ బావి వద్దకు తన ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా.. గ్రామ శివారులోని డీబీఎస్ కంపెనీ క్రాసింగ్ సమీపంలో కరీంనగర్ నుంచి వరంగల్ వైపు వెళ్తున్న కారు వెనక నుంచి ఢీకొట్టింది. తీవ్ర గాయాలైన మొండయ్య సంఘటనా స్థలంలోనె మృతిచెందాడు. గ్రామస్తుల సమాచారం మేరకు పోలీసులు చేరుకొని కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలున్నారు.
తప్పిపోయిన బాలుడు.. తల్లిదండ్రులకు అప్పగించిన పోలీసులు
తిమ్మాపూర్ : ఎల్‌ఎండీ పోలీస్ స్టేషన్‌లో తప్పిపోయిన బాలుడు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మండలంలోని రేణుకుంట టోల్ ప్లాజా వద్ద రాజీవ్ రహదారిపై నడుచుకుంటూ వెళ్తుండగా, టోల్ సిబ్బంది గమనించి వివరాలు అడిగారు. ఏమీ చెప్పక పోవడంతో పోలీస్ స్టేషన్లో అప్పగించారు. దీంతో పోలీసులు దీనిపై వివిధ పోలీస్ స్టేషన్లకు సమాచారం అందించారు. ఇంతలో బాలుడి తల్లిదండ్రులు తమ బాబు కోసం వెతుకుతున్నట్లు కొత్తపల్లి వాసులు గమనించారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో వారు కొత్తపల్లికి వెళ్లి విచారణ చేశారు. ఫంక్షన్ హాల్‌లో పనికి వచ్చిన వారి కొడుకుగా బాలుడిని గుర్తించారు. దీంతో ఠాణాకు తీసుకువచ్చి బాలుడిని అప్పగించామని ఎస్సై అన్వర్ తెలిపారు.


