బోయినపల్లి(చొప్పదండి): సీఎం రేవంత్‌రెడ్డి జిల్లా పర్యటన నేపథ్యంలో ఈ నెల 30న జరిగే సిరిసిల్ల బహిరంగ సభ వేదికగా తమ సమస్యల పరిష్కారానికి ప్రకటన చేస్తారని మిడ్‌మానేరు నిర్వాసితులు ఆశగా ఎదురుచూస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం మిడ్ మానేరు ప్రాజెక్టు నిర్వాసితుల సమస్యలు పూర్తిగా పరిష్కా రం కాకపోవడంతో వారిలో ఆవేదన నెలకొంది. ఇళ్ల నిర్మాణ పరిహారం, గెజిట్ మిస్సింగ్, వృత్తిమార్పు, అడుగు జాగల పరిహారం, ఉపాధి అవకాశాలు తదితర అనేక ప్రధాన డిమాండ్లు ఏళ్ల తరబడి పెండింగ్‌లోనే ఉన్నాయి. సీఎం బహిరంగ సభ నేపథ్యంలో నిర్వాసితుల్లో మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి.
రూ.5 లక్షల సాయంపైనే అందరి దృష్టి
మిడ్‌మానేరు ప్రాజెక్టు నిర్మాణంలో 10,683 మందిని ప్రభుత్వం పీడీఎఫ్(ప్రాజెక్టు డిస్‌ప్లేస్‌డ్ ఫ్యామిలీస్)గా గుర్తించింది. ఆర్‌అండ్‌ఆర్ కాలనీలు ఏర్పాటు చేసి ఒక్కో నిర్వాసితునికి 242 చదరపు గజాల ఇంటిస్థలం పట్టా, ప్యాకేజీ సైతం ఇచ్చింది. నిర్వాసితుల ఇళ్ల నిర్మాణాలకు రూ. 5.04 లక్షల ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని గతంలో హామీలు ఇచ్చారు. అప్పటి నుంచి నిర్వాసితులు తమ ఇళ్ల నిర్మాణాలకు రూ.5 లక్షల ప్యాకేజీ వస్తుందని ఆశలో ఉన్నారు. చాలా మంది బ్యాంకు రుణాలు తీసుకుని ఇల్లు నిర్మాంచుకున్నారు. రుణాలు చెల్లించలేదని గతంలో బ్యాంకులు ఇళ్లు జప్తు చేసిన సంఘటనలు ఉన్నాయి. అయితే గతేడాది ఇల్లు నిర్మించుకోనివారికి ప్రభుత్వం 4,696 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసినా ఇప్పటికి ప్రారంభించలేదని తెలిసింది. ఇల్లు నిర్మించుకుంటున్న ప్రతీ నిర్వాసిత కుటుంబానికి రూ.5లక్షల సాయం అందించాలని బలంగా డిమాండ్ చేస్తున్నారు.
అప్పుడు ఉద్యమ మద్దతు..
ఇప్పుడు సీఎం హోదా
గతంలో మిడ్ మానేరు నిర్వాసితులు తమ న్యాయమైన హక్కుల కోసం చేపట్టిన ‘వంటా వార్పు’, ‘సడక్ బంద్’, ‘మహాధర్నా’ వంటి అనేక నిరసన కార్యక్రమాల్లో ఉద్యమ నాయకుడిగా రేవంత్ రెడ్డి స్వయంగా పాల్గొని మద్దతు తెలిపారు. ఇప్పుడు ముఖ్యమంత్రిగా స్వయంగా సిరిసిల్లకు వస్తుండటంతో తమ ఏళ్ల నాటి సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని నిర్వాసితులు గంపెడాశలు పెట్టుకున్నారు.
రూ.10 కోట్లు మంజూరు?
సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన నేపథ్యంలో ముంపు గ్రామాల్లో పెండింగ్ పరిహారాలకు సంబంధించిన సుమారు రూ. 10.25 కోట్ల మేర నిధులు మంజూ రు చేసినట్లు స్థానిక నాయకులు పేర్కొంటున్నారు. ఇందులో యువతీ, యువకుల ప్యాకేజీతో పాటు మరి కొన్ని పరిహారాలు ఉన్నట్లు చెబుతున్నారు.
ఒడవని మిడ్‌మానేరు సమస్యలు
మెరుగు పడని ఉపాధి అవకాశాలు
సీఎం ప్రకటనపైనే ఆశలు


