కొత్తపల్లి(కరీంనగర్): భార్యపై అనుమానంతో పెట్రోల్, యాసిడ్ పోసి, కారప్పొడి చల్లి నిప్పంటించేందుకు భర్త యత్నించాడు. ఈ ఘటన కరీంనగర్ సమీపంలోని చింతకుంటలో కలకలం రేపింది. నిందితుడు మొలంగూరు ఆంజనేయులును పోలీసులు అరెస్ట్ చేయగా, అతడి తండ్రి మొలంగూరు లక్ష్మీనారాయణ పరారీలో ఉన్నాడు. కొత్తపల్లి ఇన్‌స్పెక్టర్ బిల్ల కోటేశ్వర్ కథనం ప్రకారం.. చింతకుంటకు చెందిన మొలంగూరు అనూషకు సుమారు 16 ఏళ్ల క్రితం ఆంజనేయులుతో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు. కొంతకాలంగా అనూష మరోవ్యక్తితో చనువుగా ఉంటుందనే అనుమానంతో ఆంజనేయులు తరచూ గొడవపడుతున్నాడు. ప్రస్తుతం కిసాన్‌నగర్‌లో ఉంటున్న అనూష.. మంగళవారం చింతకుంట ప్రభుత్వ పాఠశాల వద్దకు రాగా, ముందస్తు పథకం ప్రకారం ఆంజనేయులు, అతడి తండ్రి లక్ష్మీనారాయణ అక్కడికి చేరుకున్నారు. మాట్లాడాల్సి ఉందని చెప్పి పక్కకు తీసుకెళ్లి పెట్రోల్, యాసిడ్ పోసి, కారప్పొడి చల్లి అగ్గిపెట్టెతో నిప్పంటించేందుకు ప్రయత్నించారు. ఈక్రమంలో అప్రమత్తమైన అనూష గట్టిగా కేకలు వేయడంతో ఉపాధ్యాయులు బయటకు వచ్చారు. వారిని చూసి నిందితులు పరారయ్యారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. నిందితుడు ఆంజనేయులును అరెస్ట్ చేయగా, మరోనిందితుడు లక్ష్మీనారాయణ పరారీలో ఉన్నట్లు సీఐ తెలిపారు. ఎస్‌ఐ సాంబమూర్తి, పోలీసులు పాల్గొన్నారు.
భార్యపై అనుమానంతో హత్యాయత్నం
భర్తను అరెస్ట్ చేసిన పోలీసులు.. పరారీలో మామ


