ధర్మారం: ఒంటరితనం.. అనారోగ్యం.. ఆర్థిక ఇబ్బందులు భరించలేక ఓ వృద్ధుడు ఇంట్లోనే పెట్రోలు పోసుకుని నిప్పంటించుకుని ప్రాణాలు తీసుకున్న సంఘటన సోమవారం పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం దొంగతుర్తి గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన జుంజుపల్లి నారాయణ(60) కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. కుటుంబ సభ్యులు వేర్వేరు ప్రాంతాల్లో ఉండటంతో ఇంట్లో ఒంటరిగానే జీవనం సాగించేవాడు. సోమవారం ఇంట్లోనే పెట్రోలు ఒంటిపై పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడటంతో కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు.
దూరమైన కుటుంబం.. ఒంటరి జీవితం
నారాయణకు భార్య రమతోపాటు ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. పిల్లలందరికి వివాహాలు జరిగాయి. కుమార్తె అత్తగారింట్లో ఉండగా.. ఇద్దరు కుమారులు ఉద్యోగాల నిమిత్తం వేర్వేరు ప్రాంతాల్లో నివసిస్తున్నారు. భార్య కొంతకాలంగా దూరంగా ఉంటోంది. మూడు నెలల క్రితం కాలికి గాయం కావడంతో ఇన్‌పెక్షన్ అయి, అనారోగ్య సమస్యలను భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై శ్రీకాంత్ సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతుడి కుమారుడు రాజ్‌కుమార్ ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు.


