దావత్‌కు పిలిచి.. ప్రాణం తీసి | - | Sakshi
Sakshi News home page

దావత్‌కు పిలిచి.. ప్రాణం తీసి

Sep 29 2026 12:27 AM | Updated on Sep 29 2026 12:27 AM

● కత్తితో దాడి చేసి హత్య

● పెద్దపాపయ్యపల్లి శివారులో కలకలం

హుజూరాబాద్‌రూరల్‌:

సమీప బంధువును మందు తాగుదామని దావత్‌కు పిలిచి ముందుగా అనుకున్నట్లుగా కత్తితో దాడి చేసి ప్రాణం తీసిన సంఘటన కలకలం సృష్టించింది. స్థానికులు తెలిపిన వివరాలు. కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌ మండలం పెద్దపాపయ్యపల్లి శివారులోని ఎస్సారెస్పీ కాలువ వద్ద సోమవారం దారుణహత్య వెలుగుచూసింది. హన్మకొండ జిల్లా కమలాపూర్‌ మండలం ఉప్పలపల్లికి చెందిన వడిగే రాకేశ్‌(32)కు సమీప బంధువు అంబరకొండ ప్రశాంత్‌తో కొంతకాలంగా విభేదాలు ఉన్నాయి. రాకేశ్‌ను మట్టుబెట్టాలని రెండు నెలలుగా ప్రణాళిక రచించిన ప్రశాంత్‌.. ఈనెల 27న హుజూరాబాద్‌కు రప్పించాడు. ఇద్దరూ కలిసి పట్టణ శివారులోని ఓ దాబాలో మద్యం సేవించారు. ఆ తర్వాత కేసీ క్యాంపు మీదుగా పెద్దపాపయ్యపల్లి ఎస్సారెస్పీ కెనాల్‌ వద్దకు చేరుకుని.. నిర్మానుష్య ప్రాంతంలో రాకేశ్‌పై కత్తితో దాడి చేసి హతమార్చాడు. సోమవారం ఉదయం రక్తపు మడుగులో పడి ఉన్న మృతదేహాన్ని గమనించిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. ప్రశాంత్‌ భార్యతో రాకేశ్‌కు వివాహేతర సంబంధం ఉండడమే హత్యకు కారణమని ప్రచారంలో ఉంది. కాగా నిందితుడు ప్రశాంత్‌ పోలీసులకు లొంగిపోయినట్లు సమాచారం. పోలీసులు క్లూస్‌ టీమ్‌తో ఆధారాలు సేకరించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

రామగిరి: ద్విచక్రవాహనం విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొన్న ఘటనలో ఓ యువకుడు మృతిచెందాడు. పెద్దపల్లి జిల్లా కమాన్‌పూర్‌ మండలం గుండారం గ్రామపంచాయతీ పరిధిలోని రాజాపూర్‌కు చెందిన బిజిగిరి సంజయ్‌ కుమార్‌(22) ఆదివారం రాత్రి ద్విచక్రవాహనంపై నాగెపల్లి నుంచి కమాన్‌పూర్‌ వైపు వెళ్తున్నాడు. సెంటినరీకాలనీ సమీపంలోని పోస్టాఫీస్‌ వద్ద మంథని– పెద్దపల్లి ప్రధాన రహదారిపై వాహనం వేగంగా నడపడంతో అదుపుతప్పి విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొట్టాడు. తీవ్రంగా గాయపడిన సంజయ్‌ కుమార్‌ను వెంటనే 108 అంబులెన్స్‌లో కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. తండ్రి సదయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తాడవేని శ్రీనివాస్‌ తెలిపారు.

విద్యుత్‌ ఉద్యోగి..

మెట్‌పల్లిరూరల్‌: రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని ఒకరు మృతి చెందినట్లు ఇబ్రహీంపట్నం ఎస్సై నవీన్‌ తెలిపారు. మెట్‌పల్లి మండలం బండలింగాపూర్‌ గ్రామానికి చెందిన విద్యుత్‌ ఉద్యోగి బోయిన్‌పల్లి అశోక్‌ (44), స్నేహితుడు శంకర్‌తో కలిసి ఆదివారం విట్టంపేట వైపు నుంచి స్వగ్రామానికి బైక్‌పై వస్తున్నారు. బండలింగాపూర్‌ శివారులో ఆత్మనగర్‌కు చెందిన శ్రీకాంత్‌ అనే వ్యక్తి బైక్‌పై ఎదురుగా వచ్చాడు. సైడ్‌ ఇచ్చే ప్రయత్నంలో శంకర్‌ బైక్‌ వెనుక కూర్చున్న అశోక్‌ కింద పడిపోవడంతో తలకు బలమైన గాయమైంది. అతడిని మెట్‌పల్లి ప్రభుత్వ ఆసుపత్రికి.. అక్కడి నుంచి నిజామాబాద్‌ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అశోక్‌ సోమవారం చనిపోయాడు. మృతుడి సోదరుడు శ్యామ్‌ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.

తప్పుడు పత్రాలతో భూ కబ్జా యత్నం.. ఇద్దరు అరెస్ట్‌

కొత్తపల్లి(కరీంనగర్‌): తప్పుడు దస్తావేజులు సృష్టించి భూమిని కాజేయడానికి ప్రయత్నించిన ఇద్దరిని కొత్తపల్లి పోలీసులు అరెస్ట్‌ చేశారు. సీఐ బిల్లా కోటేశ్వర్‌ వివరాల మేరకు రేకుర్తి రెవెన్యూ శివారులోని సర్వే నంబర్‌ 49లో ప్లాట్‌ నంబర్లు 25,44కు సంబంధించిన మొత్తం 599 చదరపు గజాల ఖాళీ స్థలాన్ని తప్పుడు పత్రాల ద్వారా కాజేయడానికి ప్రయత్నించినట్లు అనీస్‌ అహ్మద్‌ ఖాజీ చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ఈ కేసులో గోనె సంతోష్‌రెడ్డి, సయ్యద్‌ సాయిదుద్దీన్లను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. మరికొందరు ప్రధాన నిందితులు పరారీలో ఉన్నారు.

ఆలయాల్లో దొంగతనం

వేములవాడరూరల్‌: వేములవాడ రూరల్‌ మండలం నూకలమర్రి, బాలరాజుపల్లి గ్రామాల్లో ఉన్న పెద్దమ్మ, ఎల్లమ్మ ఆలయాల్లో ఆదివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు దొంగతనానికి పాల్పడ్డారు. ఆలయాల్లో ఉన్న బంగారు ఆభరణాలు, నగదు, ఇతర విలువైన వస్తువులను దొంగిలించినట్లు పోలీసులు గుర్తించారు. ఎస్సై ప్రశాంత్‌రెడ్డి మాట్లాడుతూ ఆలయాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement