ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ‘సర్’ వివరాలు ఇలా
● సిరిసిల్లలో వేగవంతం
● కరీంనగర్‌లో గైర్హాజరు హీట్
● నోటీసుల డెలివరీ జోరు
సాక్షి, పెద్దపల్లి: ఓటరు జాబితా సవరణ ప్రక్రియ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వేగంగా కొనసాగుతోంది. నోటీసుల జారీ, డెలివరీ, విచారణ ప్రక్రియ కూడా పూర్తి కావస్తోంది. సోమవారం వరకు కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, సిరిసిల్ల జిల్లాల్లో కలిపి 6,94,517 నోటీసులు జనరేట్ కాగా.. 6,81,934 నోటీసులు డెలివరీ అయ్యాయి. ఇంకా 12,583 నోటీసులు డెలివరీ చేయాల్సి ఉంది. నోటీసుల డెలివరీలో సిరిసిల్ల జిల్లా ముందంజలో ఉంది. అక్కడ 83,846 నోటీసులు జనరేట్ కాగా 83,835 డెలివరీ అయ్యాయి. కేవలం 11 మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయి. పెద్దపల్లిలో 2,210, జగిత్యాలలో 4,448, కరీంనగర్‌లో 5,914 నోటీసులు డెలివరీ కావాల్సి ఉంది. డెలివరీ పెండింగ్‌లో జగిత్యాల రెండోస్థానంలో ఉంది. కరీంనగర్‌లో ఎక్కువగా ఉన్నాయి.
4.35 లక్షల కేసులకు పరిష్కారం
నోటీసులు అందుకున్న ఓటర్ల విచారణలో భాగంగా సరైన ఓటర్లుగా డీఈవోలు (జిల్లా ఎన్నికల అధికారి) గుర్తించినవారు కరీంనగర్‌లో 1,73,173, జగిత్యాలలో 1,19,456, పెద్దపల్లిలో 76,418, సిరిసిల్లలో 65,978 మంది ఉన్నారు. నాలుగు జిల్లాల్లో కలిపి సుమారు 4.35 లక్షల కేసులు పరిష్కారమయ్యాయి. వీరిని తుది ఓటరు జాబితాలో చేర్చనున్నారు. వెరిఫికేషన్ పెండింగ్‌లో ఉన్న కేసులు పెద్దపల్లిలో 55, సిరిసిల్లలో 2, కరీంనగర్, జగిత్యాలలో ఒకటి చొప్పున మాత్రమే ఉన్నాయి. విచారణలో అనర్హులుగా తేలినవారిలో పెద్దపల్లి 402 మందితో ముందుంది. జగిత్యాలలో 155, సిరిసిల్లలో 121, కరీంనగర్‌లో 22 మంది ఉన్నారు.
గైర్హాజరులో కరీంనగర్ ముందంజ
విచారణకు గైర్హాజరైన ఓటర్ల సంఖ్యలో కరీంనగర్ జిల్లాదే అత్యధికం. అక్కడ 67,550 మంది విచారణకు హాజరుకాలేదు. జగిత్యాలలో 60,274, పెద్దపల్లిలో 50,916, సిరిసిల్లలో 13,867 మంది గైర్హాజరయ్యారు. రీషెడ్యూల్ చేసిన తేదీల్లోనూ హాజరుకాని కేసులు పెద్దపల్లిలో 252, సిరిసిల్లలో 157, జగిత్యాలలో 42, కరీంనగర్‌లో ఒక్కటి ఉన్నాయి.
వివరాలు కరీంనగర్ పెద్దపల్లి జగిత్యాల సిరిసిల్ల నోటీసులు జనరేట్ 2,70,190 1,47,518 1,92,963 83,846 నోటీసులు డెలివరీ 2,64,276 1,45,308 1,88,515 83,835 డెలివరీ పెండింగ్ 5,914 2,210 4,448 11 విచారణ పూర్తి 1,97,104 87,407 1,29,730 68,982 విచారణ గైర్హాజరు 67,550 50,916 60,274 13,867


