కరీంనగర్‌రూరల్: చల్మెడ ఆనందరావు మెడికల్ కళాశాలకు చెందిన విద్యార్థి నాగడి పునీత్ వర్మ(28) ఎంబీబీఎస్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించలేక మానసిక వేదనతో ఎక్కువ మోతాదులో మందులు తీసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కరీంనగర్‌రూరల్ సీఐ నిరంజన్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని కృష్ణా జిల్లాకు చెందిన పునీత్‌వర్మకు 2019సంవత్సరంలో కౌన్సెలింగ్ ద్వారా చల్మెడ ఆనందరావు మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్‌లో ఉచిత సీటు లభించింది. 2025లోనే ఎంబీబీఎస్ పూర్తి చేయాల్సి ఉండగా మానసిక, ఆరోగ్య సమస్యలతో ఉత్తీర్ణత సాధించలేకపోయాడు. కుమారుడి మానసిక పరిస్థితి దృష్ట్యా తండ్రి శంకర్‌బాబు భార్యతో కలిసి గుంటూరుపల్లిలో ఇల్లు అద్దెకు తీసుకుని ఉంటున్నారు. అయితే పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించలేకపోయాననే మానసిక ఆందోళనకు గురైన పునీత్ సోమవారం బెంజోడియాజిపైన్ అనే మాత్రలను ఎక్కువ మోతాదులో తీసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని పోస్ట్‌మార్టం అనంతరం పునీత్ మృతదేహాన్ని అప్పగించినట్లు సీఐ నిరంజన్‌రెడ్డి తెలిపారు.
ఉరేసుకొని యువకుడు..
పాలకుర్తి: మండల పరిధిలోని జయ్యారం శివారులోని ఓ క్రషర్‌లో ధానేశ్వర్(28) అనే యువకుడు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఒడిశా రాష్ట్రానికి చెందిన ధానేశ్వర్ నాలుగు మాసాల క్రితమే స్థానికంగా క్రషర్‌లో ఉపాధి నిమిత్తం చేరాడు. ఆదివారం నుంచి కనిపించకుండా పోయిన ధానేశ్వర్ సోమవారం ఉదయం క్రషర్ సమీపంలో ఉరి వేసుకొని మృతిచెందినట్లు గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పెద్దపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆత్మహత్యకు గల కారణాలపై మృతుడి బంధువులు వస్తేనే స్పష్టత వస్తుందని పోలీసులు పేర్కొన్నారు.
మద్యం వద్దన్నందుకు..
జగిత్యాలక్రైం: జిల్లాకేంద్రంలోని శివవీధి ప్రాంతానికి చెందిన దేవరకొండ సంతోష్‌కుమార్(39) ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పట్టణ ఎస్సై కుమారస్వామి తెలిపారు. సంతోష్‌కుమార్ కొన్నాళ్లుగా ఖాళీగా తిరుగుతూ.. మద్యానికి బానిసయ్యాడు. మద్యం తాగవద్దని కుటుంబ సభ్యులు కోరినా వినడం లేదు. సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకున్నాడు. మృతుడి భార్య ఉమారాణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
అప్పు తీర్చలేక..
జగిత్యాలక్రైం: జగిత్యాల అర్బన్ మండలం మోతె గ్రామానికి చెందిన ఇంద్రాల రాజేశ్ (30) అప్పులు తీర్చలేక సోమవారం ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై ఉమాసాగర్ కథనం ప్రకారం.. రాజేశ్ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేశాడు. ఐదేళ్ల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. చికిత్స కోసం రూ.10లక్షల ఖర్చయ్యింది. అప్పు తీర్చలేమోననే ఆందోళనతో కొంతకాలంగా మానసికంగా కుంగిపోతున్నాడు. మనస్తాపంతో ఉరేసుకున్నాడు. రాజేశ్ భార్య మౌనిక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.


