సిరిసిల్ల: దేశంలో బీజేపీ ముసుగులో ఆర్‌ఎస్‌ఎస్ పాలన సాగుతోందని ప్రభుత్వ సలహాదారు, రాజ్యసభ మాజీ సభ్యుడు వి.హన్మంతరావు ఆరోపించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ వద్ద సోమవారం భారత ఎన్నికల ప్రధాన అధికారి జ్ఞానేశ్‌కుమార్ దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలిపారు. హన్మంతరావు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా జనగణన జరుగుతుండగా.. బీసీ జనాభాను లెక్కించే ప్రక్రియను చేపట్టడం లేదన్నారు. దేశవ్యాప్తంగా బీసీ జనాభా లెక్కలు తేల్చాలని డిమాండ్ చేశారు. కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం రాష్ట్రంలో బీసీ జనాభాను లెక్కించి నివేదికను గవర్నర్‌కు పంపించారన్నారు. ఏ ఆలయంలోనైనా హుండీ లెక్కలను ఎప్పటికప్పుడు ప్రకటిస్తారని, అయోధ్యలోని రామాలయం హుండీ లెక్కలను చెప్పడం లేదన్నారు. ట్రస్ట్‌బోర్డు కమిటీ సభ్యులే డబ్బులు కాజేస్తున్నారని ఆరోపించారు. 2020 నుంచి 2024 వరకు లెక్కలే లేవన్నారు. అనంతరం ఈనెల 30న జరిగే సీఎం రేవంత్‌రెడ్డి సభ ఏర్పాట్లను పరిశీలించారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, డీసీసీ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్, సిరిసిల్ల నియోజకవర్గం ఇన్‌చార్జి కె.కె.మహేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఆలయ సొమ్మును స్వాహా చేస్తున్నారు
ప్రభుత్వ సలహాదారు వి.హన్మంతరావు


