జ్యోతినగర్: విద్యుదుత్పత్తి రంగంలో మరో కీలక మైలురాయిని అధిగమించే దిశగా పెద్దపల్లి జిల్లా రామగుండంలోని ఎన్టీపీసీ ముందడుగు వేస్తోంది. తెలంగాణ సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్టు(టీఎస్‌టీపీపీ) స్టేజ్–2లో 2,400 మెగావాట్ల అదనపు విద్యుదుత్పత్తి సామర్థ్యాన్ని అందుబాటులోకి తీసుకురావడానికి పనులు వేగం పుంజుకుంటున్నాయి. ఇందు కోసం యూనిట్–3 ప్రధాన ప్లాంట్ నిర్మాణానికి భూమిపూజ చేశారు. సివిల్ పనులకు శ్రీకారం చుట్టారు. ఒక్కొక్కటి 800 మెగావాట్ల సామర్థ్యంతో మూడు సూపర్ క్రిటికల్ యూనిట్లను నిర్మించనున్నారు.
స్టేజ్–2తో 4వేల మెగావాట్లకు విద్యుత్ ఉత్పత్తి
ప్రాజెక్టు స్టేజ్–1లో ఇప్పటికే రెండు 800 మెగావాట్ల యూనిట్లు విద్యుదుత్పత్తి చేస్తున్నాయి. వీటిసామర్థ్యం 1,600 మెగావాట్లు. స్టేజ్–2లో మరోమూడు యూనిట్ల నిర్మాణం పూర్తయితే సామర్థ్యం 4 వేల మెగావాట్లకు చేరనుంది.
రూ.29,344 కోట్లతో నిర్మాణం
స్టేజ్–2 నిర్మాణానికి ఎన్టీపీసీ బోర్డు 2024 నవంబర్‌లో రూ.29,344.85 కోట్ల పెట్టుబడికి ఆమోదం తెలిపింది. ప్రధాన ప్లాంట్ ఈపీసీ ప్యాకేజీని బీహెచ్‌ఈఎల్‌కు అప్పగించారు. ఈనెల 26న నిర్వహించిన భూమిపూజతో యూనిట్–3 సివిల్ పనులు ప్రారంభమయ్యాయి. స్టేజ్–2లో ఎయిర్ కూల్డ్ కండెన్సర్ (ఏసీసీ) సాంకేతికతను వినియోగించనున్నారు. ఈ విధానం ద్వారా ప్రధాన ప్లాంట్‌లో నీటి వినియోగాన్ని గణనీయంగా తగ్గించవచ్చని అధికార వర్గాలు భావిస్తున్నాయి.
స్థానికులకు ఉపాధి అవకాశాలు
ప్రాజెక్టు నిర్మాణ సమయంలో సివిల్ పనులు, మెటీరియల్ నిర్వహణ, ఇతర కార్యకలాపాల్లో స్థానికులకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు కేంద్ర విద్యుత్ శాఖ పార్లమెంటుకు తెలిపింది. స్థానిక యువత ఉపాధి అవకాశాలను పెంచేందుకు నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను కూడా చేపడుతున్నట్లు వెల్లడించింది.
2030 సెప్టెంబర్ నాటికి లక్ష్యం
స్టేజ్–2లోని మూడు యూనిట్లను దశలవారీగా ప్రారంభించేందుకు ప్రణాళిక రూపొందించారు. 2030 సెప్టెంబర్ నాటికి యూనిట్లను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ విస్తరణ పూర్తయితే తెలంగాణ సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్టు 4 వేల మెగావాట్ల స్థాపిత సామర్థ్యంతో విద్యుదుత్పత్తి చేయనుంది.
2,400 మెగావాట్ల స్టేజ్–2కు శ్రీకారం


