జిల్లెల్లలో దళిత రైతు ఆత్మహత్యాయత్నం | - | Sakshi
Sakshi News home page

జిల్లెల్లలో దళిత రైతు ఆత్మహత్యాయత్నం

Sep 28 2026 1:29 AM | Updated on Sep 28 2026 1:29 AM

తంగళ్లపల్లి(సిరిసిల్ల): వ్యవసాయ కళాశాల కోసం భూములు తీసుకొని.. ప్రత్యామ్నాయ భూమి కేటాయింపులో అన్యాయం చేశారంటూ ఓ దళిత రైతు ఆదివారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన రాజన్నసిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం జిల్లెల్ల గ్రామంలో ఉద్రిక్తతకు దారితీసింది. గ్రామస్తులు, రైతులు తెలిపిన వివరాలు. వ్యవసాయ కాలేజీ నిర్మాణానికి ప్రభుత్వం 40 ఎకరాలు సేకరించింది. కొందరికి ప్రత్యామ్నాయ భూములు కేటాయిస్తామని హామీ ఇచ్చినప్పటికీ, పట్టాలు, క్షేత్రస్థాయిలో పొజిషన్‌ అప్పగించడం లేదు. ఏళ్లుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈక్రమంలో తీవ్ర మనస్తాపానికి గురైన రైతు చెల్లం వినోద్‌ ఒంటిపై పెట్రోల్‌ పోసుకుని నిప్పంటించుకునేందుకు ప్రయత్నించాడు. అక్కడే ఉన్న తోటి రైతులు, స్థానికులు అప్రమత్తమై పెట్రోల్‌ బాటిల్‌ను లాక్కోవడంతో ప్రమాదం తప్పింది.

‘నా భూమి నాకిప్పించండి’

సర్వే నంబర్‌ 662లోని మూడెకరాలు లావణి పట్టా భూమిని అధికారులు ఇతరులకు కేటాయించారని బాధిత రైతు వినోద్‌ ఆరోపించారు. ఆ సర్వే నంబర్‌లో మిగిలిన నాలుగెకరాల నుంచి తనకు ఎకరంన్నర నుండి రెండు ఎకరాల వరకు కేటాయించాలని పదేళ్లుగా కలెక్టర్‌, తహసీల్దార్‌ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదన్నారు. ఆ మిగులు భూమిని కూడా ఇతరులు కబ్జా చేసి, తనను సాగు చేసుకోకుండా బెదిరింపులకు దిగుతున్నారని వాపోయారు. ఎవరూ పట్టించుకోవడం లేదని.. విధిలేని పరిస్థితుల్లోనే ఆత్మహత్యకు యత్నించాల్సి వచ్చిందని కన్నీటిపర్యంతమయ్యారు.

వ్యవసాయ కళాశాలకు భూములు తీసుకుని అన్యాయం చేశారని ఆవేదన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement