● మూడు నెలల క్రితమే తల్లి మృతి
వేములవాడరూరల్: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం వట్టెంల గ్రామానికి చెందిన కాసారపు నరేందర్(26) మూడు రోజుల క్రితం గల్ఫ్‌లో గుండెపోటుతో మృతిచెందాడు. గ్రామస్తులు తెలిపిన వివరాలు. కాసారపు నారాయణ–వెంకటవ్వ దంపతులకు కుమారుడు, కూతురు. వెంకటవ్వ మూడు నెలల క్రితం అనారోగ్యంతో మృతిచెందింది. తల్లి మృతి చెందిన వార్త తెలుసుకున్న కుమారుడు గల్ఫ్ నుంచి వచ్చి అంత్యక్రియలు నిర్వహించి తిరిగి వెళ్లాడు. కంపెనీలో పనిచేస్తుండగా గుండెపోటుతో మరణించినట్లు అతని స్నేహితులు తెలిపారు. మూడు నెలల వ్యవధిలో తల్లీకొడుకులు మృతిచెందడంతో సోదరి, తండ్రి అనాథలయ్యారు. నరేందర్ మృతదేహాన్ని స్వదేశానికి రప్పించడానికి స్నేహితులు ప్రయత్నం చేస్తున్నారు.
ఇండియన్ ఎంబసీకి ప్రభుత్వ విప్ లేఖ
నరేందర్ మృతదేహాన్ని స్వగ్రామానికి తెప్పించేందుకు ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఇండియన్ ఎంబసీకి లేఖ రాశారు.
ఉసిరికాయల కోసం చెట్టెక్కి..
● అదుపుతప్పి కార్మికుడి మృతి
యైటింక్లయిన్‌కాలనీ: పెద్దపల్లి జిల్లా గోదావరిఖని టూటౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని పోతనకాలనీ–77 బ్లాక్–1071క్వార్టర్‌లో నివాసం ఉంటూ ఏఎల్‌పీ గనిలో కార్మికుడిగా పనిచేస్తున్న వేముల రాజేందర్ (55) ఆదివారం ఉసిరిచెట్టు పైనుంచి పడి మృతి చెందాడు. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. రాజేందర్ తను నివాసం ఉంటున్న భవనం మొదటి అంతస్తు ఎక్కి ఉసిరికాయలు తెంపుతున్నాడు. ప్రమాదవశాత్తు కాలు జారిపడి చెట్టు పైనుంచి కింద పడిపోయాడు. తలకు తీవ్రగాయాలు కావడంతో కుటుంబ సభ్యులు, స్థానికులు గోదావరిఖని సింగరేణి ఏరియా ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుడి భార్య సత్తమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొన్నారు. మృతుడికి భార్య, ఒక కుమార్తె ఉన్నారు. రాజేందర్ మృతితో పోతనకాలనీలో విషాద చాయలు నెలకోన్నాయి. కాగా, సదాశయ ఫౌండేషన్ చొరవతో మృతుడి నేత్రాలను కుటుంబ సభ్యులు దానం చేశారు.


