గంభీరావుపేట(సిరిసిల్ల): విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు.. సేవాభావం పెంపే స్కౌట్స్ లక్ష్యం. స్కౌట్స్ అండ్ గైడ్స్‌ను బలోపేతం చేసేందుకు సమగ్రశిక్ష ద్వారా పాఠశాల విద్యాశాఖ చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా స్కౌట్స్ అండ్ గైడ్స్ శిక్షణకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 79 పాఠశాలలను ఎంపిక చేశారు. ఎంపికై న ఒక్కో పాఠశాలకు శిక్షణ, అవసరమైన సామగ్రి, యూనిఫాం తదితరాల కోసం రూ.69 వేల చొప్పున మంజూరు చేశారు. ఆయా పాఠశాలల్లో 16 మంది బాలురు, 16 మంది బాలికలను ఎంపిక చేయనున్నారు. శిక్షణ పొందిన ఉపాధ్యాయులు విద్యార్థులకు ట్రెయినింగ్ ఇవ్వనున్నారు.
క్రమశిక్షణ.. సేవాభావం
స్కౌట్స్ అండ్ గైడ్స్ ద్వారా విద్యార్థుల్లో క్రమశిక్షణ, సేవాభావం పెంచడమే లక్ష్యంగా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. పాఠశాల స్థాయిలో స్కౌట్స్ అండ్ గైడ్స్ ఉద్యమాన్ని విస్తరించడం ద్వారా భవిష్యత్ తరాల్లో సేవా స్ఫూర్తిని పెంపొందించవచ్చని విద్యాశాఖ అధికారులు భావిస్తున్నారు. ఎంపికై న విద్యార్థులు శిక్షణలో ప్రతిభ చాటితే రాజ్య పురస్కార్ లేదా రాష్ట్రపతి అవార్డులు సొంతం చేసుకోవచ్చు. ఆయా విద్యార్థులకు ఉన్నత విద్యా ప్రవేశాలు, ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో ప్రత్యేక ప్రాధాన్యత కల్పిస్తారు.
ఉమ్మడి జిల్లా వివరాలు
‘భారత్ స్కౌట్ అండ్ గైడ్స్’కు బలం
ఉమ్మడి జిల్లాలో 79 పాఠశాలలు ఎంపిక
ఒక్కో పాఠశాలకు రూ.69వేలు సమగ్రశిక్ష నిధులు
జిల్లా ఎంపికై న పాఠశాలలు నిధులు(రూ.లలో)
రాజన్న సిరిసిల్ల 21 రూ. 14,49,000
పెద్దపల్లి 9 రూ.6,21,000
జగిత్యాల 31 రూ.21,39,000
కరీంనగర్ 18 రూ.12,42,000


