కొత్తపల్లి(కరీంనగర్): బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలో రానున్న మూడు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ, కొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో విద్యుత్ శాఖ అప్రమత్తమైంది. వర్షాలతో విద్యుత్ అంతరాయాలు, ప్రమాదాలు చోటుచేసుకోకుండా ఉత్తర విద్యుత్ పంపిణీ సంస్థ (టీజీఎన్పీడీసీఎల్) కరీంనగర్ సర్కిల్ పూర్తి స్థాయిలో సన్నద్ధమైందని ఎస్‌ఈ ఏ.విజేందర్‌రెడ్డి తెలిపారు.
24/7 కంట్రోల్ రూమ్ ఏర్పాటు
విద్యుత్ సంబంధిత సమస్యలు తలెత్తిన వెంటనే స్పందించేందుకు 24/7 కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు ఎస్‌ఈ తెలిపారు. వినియోగదారులు 8712488004 లేదా టోల్‌ఫ్రీ 1912కు ఫిర్యాదు చేయాలని సూచించారు. క్షేత్రస్థాయిలో విద్యుత్ సిబ్బంది అందుబాటులో ఉండాలని, సరఫరా పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. వర్షాల కారణంగా చెట్లు విరిగిపడి విద్యుత్ తీగలు తెగిపోయే పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని అవసరమైన విద్యుత్ స్తంభాలు, ఇతర సామగ్రిని సిద్ధంగా ఉంచినట్లు పేర్కొన్నారు. తడిసిన విద్యుత్ స్తంభాలు, స్టే వైర్లు, ట్రాన్స్‌ఫార్మర్లు, విద్యుత్ పరికరాలు, తడి గోడలకు ఆనుకుని ఉన్న ఉపకరణాలను తాకవద్దని ఎస్‌ఈ హెచ్చరించారు. గృహ వినియోగదారులు తడి చేతులతో స్విచ్‌లు, ప్లగ్‌లు, మీటర్ బోర్డులు, మోటార్లు, గీజర్లు, కూలర్లు, వాటర్ హీటర్లు తదితరాలను తాకరాదన్నారు. వ్యవసాయ మోటార్లు, స్టార్టర్లు, పంపుసెట్లు, జిఐ పైపులు తదితరాలకు సరైన ఎర్తింగ్ ఉండేలా చూసుకోవాలని సూచించారు. ట్రాన్స్‌ఫార్మర్ల వద్ద ఫ్యూజులు మార్చడం, ఏబీ స్విచ్‌లు ఆపరేట్ చేయడం, కాలిన తీగలను సరిచేయడం వంటి పనులను స్వయంగా చేయరాదన్నారు. పిల్లలను విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు, మీటర్ బోర్డుల వద్ద ఆడనివ్వకూడదన్నారు. పశువులను విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లకు కట్టవద్దని పశువుల కాపరులకు సూచించారు.
వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలి
కరీంనగర్ సర్కిల్ ఎస్‌ఈ ఏ.విజేందర్‌రెడ్డి


