విద్యుత్‌ పొదుపు.. ఆర్థిక మదుపు | - | Sakshi
Sakshi News home page

విద్యుత్‌ పొదుపు.. ఆర్థిక మదుపు

Sep 25 2026 1:59 AM | Updated on Sep 25 2026 1:59 AM

కొత్తపల్లి(కరీంనగర్‌): విద్యుత్‌ను పొదుపుగా వినియోగించడం ద్వారా విద్యుత్‌ బిల్లు తగ్గించుకోవడమే కాకుండా కుటుంబ ఆర్థిక స్థితికి మేలు జరుగుతుందని టీజీఎన్పీడీసీఎల్‌ కరీంనగర్‌ సర్కిల్‌ ఎస్‌ఈ ఏ.విజేందర్‌రెడ్డి తెలిపారు. పొదుపు చేసిన ప్రతీ యూనిట్‌ విలువైనదని ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రతీ ఇంట్లో అనవసర విద్యుత్‌ వినియోగాన్ని కొంత మేర తగ్గించినా, లక్షలాది కుటుంబాలు అదే విధానాన్ని పాటిస్తే మొత్తం విద్యుత్‌ డిమాండ్‌పై గణనీయమైన ప్రభావం ఉంటుందన్నారు. విద్యుత్‌ పొదుపు అంటే కేవలం బిల్లు తగ్గించుకోవడం కాదు.. భవిష్యత్‌ విద్యుత్‌ అవసరాలకు సిద్ధం కావడం అని తెలిపారు. ఒక కుటుంబం రోజుకు కొద్దిగా విద్యుత్‌ పొదుపు చేయడం చిన్న విషయంగా కనిపించవచ్చు. కానీ అదే అలవాటును లక్షలాది కుటుంబాలు పాటిస్తే మొత్తం విద్యుత్‌ డిమాండ్‌పై గణనీయమైన ప్రభావం ఉంటుందని అన్నారు. విద్యుత్‌ పొదుపును ఒకరోజు కార్యక్రమంగా కాకుండా రోజువారీ జీవనశైలిలో భాగంగా చేసుకోవాలని, విద్యుత్‌ను పొదుపుగా వినియోగించడం ప్రతీ వినియోగదారుడి బాధ్యత అని సూచించారు.

● రోజుకు రెండు యూనిట్లు ఆదా చేస్తే..

ఒక కుటుంబం రోజుకు రెండు యూనిట్ల విద్యుత్‌ను పొదుపు చేస్తే నెలకు సుమారు 60 యూనిట్లు, సంవత్సరానికి సుమారు 730 యూనిట్ల వరకు ఆదా చేయవచ్చని ఎస్‌ఈ వివరించారు. అయితే దీనివల్ల కలిగే నగదు ఆదా వినియోగదారుడి టారిఫ్‌, స్లాబ్‌, వినియోగ విధానం, పరికరాల సామర్థ్యం తదితర అంశాలపై ఆధారపడి ఉంటుందని తెలిపారు.

● ఏసీ వినియోగంలో ప్రత్యేక శ్రద్ధ

ఇళ్లలో విద్యుత్‌ వినియోగంలో ఏసీలు ప్రధాన భాగమని, వాటిని అవసరానికి మించి తక్కువ ఉష్ణోగ్రత వద్ద నడపకుండా 24 డిగ్రీల సెల్సియస్‌ లేదా అంతకంటే ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద వినియోగించడం ద్వారా విద్యుత్‌ వినియోగాన్ని తగ్గించే అవకాశం ఉంటుందని అన్నారు. ఏసీ ఫిల్టర్లను క్రమం తప్పకుండా శుభ్రం చేయడం, తలుపులు, కిటికీలు మూసి ఉంచడం, గది ఖాళీగా ఉన్నప్పుడు ఏసీని ఆపివేయడం వంటి చర్యలు కూడా విద్యుత్‌ పొదుపుకు దోహదపడతాయని తెలిపారు.

● రోజువారీ అలవాట్లతోనే పొదుపు

అవసరం లేని లైట్లు, ఫ్యాన్లను వెంటనే ఆఫ్‌ చేయాలని, ఖాళీ గదుల్లో విద్యుత్‌ పరికరాలను నడపకూడదని సూచించారు. గీజర్లు, వాటర్‌ హీటర్లు, ఇసీ్త్ర పెట్టెలు వంటి అధిక విద్యుత్‌ వినియోగ పరికరాలను అవసరమైన సమయంలో మాత్రమే ఉపయోగించాలన్నారు. కొత్త విద్యుత్‌ పరికరాలు కొనుగోలు చేసేటప్పుడు బీఈఈ స్టార్‌ రేటింగ్‌ను పరిశీలించాలని, పగటిపూట సాధ్యమైనంత వరకు సహజ కాంతిని వినియోగించాలని, ఇళ్లలో సహజ గాలి ప్రసరణకు ప్రాధాన్యం ఇవ్వాలని ఎస్‌ఈ సూచించారు.

● విద్యుత్‌ వ్యవస్థపై ఒత్తిడి తగ్గుతుంది

ప్రతీ కుటుంబం కొంత విద్యుత్‌ను పొదుపు చేయడం ద్వారా మొత్తం విద్యుత్‌ డిమాండ్‌ను నియంత్రించడంలో సహకరించవచ్చన్నారు. ముఖ్యంగా అధిక డిమాండ్‌ ఉన్న పీక్‌ సమయాల్లో అనవసర విద్యుత్‌ వినియోగాన్ని తగ్గించడం ద్వారా విద్యుత్‌ ఉత్పత్తి, ప్రసారం, పంపిణీ వ్యవస్థలపై ఒత్తిడిని తగ్గించవచ్చని తెలిపారు.

● భవిష్యత్‌ తరాలకు బాధ్యత

విద్యుత్‌ను అవసరమైనంత మాత్రమే వినియోగించడం ద్వారా సహజ వనరులను బాధ్యతాయుతంగా వినియోగించినట్లవుతుందని, భవిష్యత్‌ తరాల విద్యుత్‌ అవసరాలకు ఇది దోహదపడుతుందని చెప్పారు. విద్యుత్‌ అవసరాన్ని సమర్థవంతంగా నిర్వహించడం ద్వారా ఇంధన వనరులపై ఒత్తిడిని తగ్గించి పర్యావరణ పరిరక్షణలో ప్రతి వినియోగదారుడు తన వంతు పాత్ర పోషించవచ్చన్నారు. సరైన విధంగా, అవసరమైన సమయంలోనే విద్యుత్‌ పరికరాలను వినియోగించడం, వాటిని క్రమం తప్పకుండా నిర్వహించడం వల్ల పరికరాల పనితీరు మెరుగుపడి వాటి జీవితకాలం పెరిగే అవకాశం ఉందన్నారు.

జీవనశైలిలో పొదుపు భాగంగా తీసుకోవాలి

టీజీఎన్పీడీసీఎల్‌ కరీంనగర్‌ సర్కిల్‌ ఎస్‌ఈ విజేందర్‌ రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement