న్యూస్‌రీల్
ఫిర్యాదు చేస్తే చర్యలు
ఎడాపెడా
ఆపరేషన్లు!
కరీంనగర్ రైల్వే స్టేషన్ వెళ్లే దారిలో ఉన్న ఓ ప్రైవేటు ఆసుపత్రిలో అనారోగ్యంతో ఓ వ్యక్తి చేరాడు. అతడికి బీమా ఉందని తెలుసుకున్న ఆసుపత్రి సిబ్బంది గుండె నొప్పి అని హడావుడి చేసి అడ్మిట్ చేసుకుంది. బీమా గరిష్ట పరిమితి క్లయిమ్ చేసి గ్యాస్ ట్రబుల్ అంటూ డిశ్చార్జి చేశారు.
మంచిర్యాల చౌరస్తాలోని మరో ఆసుపత్రిలో శ్వాస సమస్యతో వచ్చిన వ్యక్తికి టీబీ ఉందని హడావుడి చేసి ఐసీయూలో చేర్చారు. 3 రోజులకు అతడు కోలుకున్నాక రూ.1.50లక్షల బిల్లేసి టీబీ లేదని చెప్పి ఇంటికి పంపారు.
సాక్షిప్రతినిధి, కరీంనగర్:
వైద్యో నారాయణో హరిః.. ప్రాణాలు కాపాడే వైద్యుడిని దేవుడితో సమానంగా చూస్తారు రోగులు. కానీ, కరీంనగర్ జిల్లాలో కొందరు ప్రైవేటు ఆసుపత్రుల నిర్వాహకులకు మాత్రం రోగులు మనుషుల్లా కాకుండా కాసులు కురిపించే యంత్రాలుగా కనిపిస్తున్నారు. ఇటీవలి కాలంలో జిల్లావ్యాప్తంగా కార్పొరేట్, ప్రైవేటు ఆసుపత్రులు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. పోటీ విపరీతంగా పెరగడం, ప్రజల్లో చైతన్యం రావడంతో చాలా ప్రైవేటు ఆసుపత్రుల ఆదాయం గణనీయంగా పడిపోయింది. పడిపోయిన తమ ఆదాయాన్ని తిరిగి పెంచుకునేందుకు కొందరు ఆసుపత్రుల నిర్వాహకులు రోగుల ప్రాణాలతో చెలగాటమమాడుతూ దందాకు తెరలేపారు. చిన్నపాటి అనారోగ్య సమస్యతో వస్తే చాలు.. ఏదో ఒక నెపం చెప్పి అనవసర ఆపరేషన్లతో పేదలను బెంబేలెత్తిస్తున్నారు. పొరపాటున బీమా ఉంటే అంతే సంగతులు. గరిష్ట పరిమితి వరకు కట్టించుకొని గానీ వదలట్లేదు.
చిన్న కారణాలకే సర్జరీలు
సాధారణంగా మందులతో నయమయ్యే చిన్నపాటి కడుపు నొప్పి లేదా ఇతర సాధారణ శారీరక నొప్పులకు కూడా ఆపరేషన్లు అవసరమంటూ రోగులను భయబ్రాంతులకు గురి చేస్తున్నారు. ముఖ్యంగా మహిళల బలహీనతలను ఆసరాగా చేసుకొని కొద్దిపాటి గర్భాశయ సమస్యలున్నా సరే.. భవిష్యత్తులో క్యాన్సర్ వస్తుందంటూ భయపెట్టి గర్భాశయాల తొలగింపు(హిస్టరెక్టమీ) శస్త్రచికిత్సలు కానిచ్చేస్తున్నారు. ఇక యువతలో వచ్చే చిన్నపాటి కడుపు నొప్పికి సైతం అపెండిసైటిస్ ముదిరిపోయిందని, వెంటనే ఆపరేషన్ చేయకపోతే ప్రాణాలకే ప్రమాదమని నమ్మించి రూ.వేలల్లో వసూలు చేస్తున్నారు. ఇవన్నీ వైద్య శాస్త్ర నియమాలకు విరుద్ధంగా, కేవలం ఆసుపత్రి గల్లా పెట్టెలు నింపుకోవడానికే చేస్తున్నారనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి.
పురుగుల మందు తాగితే చాలు..
కుటుంబ కలహాలు లేదా ఇతర కారణాలతో ఎవరైనా ఆవేశంలో పురుగుల మందు తాగి ప్రైవేటు ఆసుపత్రి గడప తొక్కితే.. అక్కడి నిర్వాహకులకు జాక్‌పాట్ దొరికినట్లే భావిస్తున్నారు. ఐసీయూ బెడ్లు, వెంటిలేటర్ సపోర్ట్, అత్యవసర మందులు, ప్రత్యేక పరీక్షల పేరిట ఇష్టానుసారంగా బిల్లులు వేస్తున్నారు. కేవలం ప్రథమ చికిత్స లేదా ప్రాథమిక వైద్యంతో నయమయ్యే కేసులకు సైతం రోజుల తరబడి ఐసీయూలో ఉంచి రూ.లక్షల బిల్లులు వేస్తున్నారు. డిశ్చార్జ్ అయ్యే సమయానికి సదరు పేద కుటుంబాలు తమకున్న ఇళ్లు, ఆస్తులు అమ్ముకోవడమో లేదా అప్పులపాలు కావడమో జరుగుతోంది. ప్రాణం దక్కితే చాలనే కుటుంబ సభ్యుల భయమే వీరికి పెట్టుబడిగా మారుతోంది.
అకారణంగా సిజేరియన్లు.. యాంజియోగ్రామ్‌లు
గతంలో ఎప్పుడూ లేని విధంగా జిల్లాలో సిజేరియన్ల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. సాధారణ ప్రసవమయ్యే అవకాశమున్నా.. ముహూర్తాల పేరిటో లేదా నొప్పుల భయం చూపో గర్భిణులను సిజేరియన్ల వైపు మళ్లిస్తున్నారు. మరోవైపు స్వల్ప గుండె నొప్పి లేదా గ్యాస్ సమస్యతో ఆసుపత్రికి వచ్చే మధ్య వయస్కులను టార్గెట్ చేసి.. గుండెలో బ్లాక్స్ ఉన్నాయంటూ భయపెట్టి వెంటనే యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ వంటి ఖరీదైన శస్త్రచికిత్సలను నెత్తిన రుద్దుతున్నారు. ఓపీ కోసం రోజుకు వంద మంది రావాల్సిన అవసరం లేదని, ఒక్క ఇన్ పేషెంట్(ఐపీ) దొరికితే చాలు.. రూ.లక్షలు గుంజొచ్చనే దారుణమైన ధోరణి కొందరు ప్రైవేటు నిర్వాహకుల్లో స్పష్టంగా కనిపిస్తోంది.
అకారణంగా శస్త్రచికిత్సలు వాంఛనీయం కాదు. ఈ వ్యవహారంలో ప్రైవేటు ఆసుపత్రులపై ఇప్పటివరకు మాకు ఫిర్యాదులు అందలేదు. ఫిర్యాదులు వస్తే తప్పకుండా చర్యలు చేపడతాం. లాభాపేక్షతో చేసే అలాంటి పనులను ఉపేక్షించేది లేదు.
– రాజగోపాలరావు, డీఎంహెచ్‌వో


