వార్షిక రుణ ప్రణాళిక ఖరారు | - | Sakshi
Sakshi News home page

వార్షిక రుణ ప్రణాళిక ఖరారు

Sep 25 2026 1:59 AM | Updated on Sep 25 2026 1:59 AM

● రూ.14,846 కోట్లతో రుణ ప్రణాళిక ● బ్యాంకర్లు రుణ లక్ష్యానికి చేరువ కావాల్సిందే ● జిల్లా అదనపు కలెక్టర్‌ శ్రీనివాస్‌రెడ్డి కోలాహలం.. మట్టి వినాయక నిమజ్జనోత్సవం

కరీంనగర్‌లోని రాంనగర్‌ మట్టి గణపతి నిమజ్జన శోభాయాత్ర గురువారం సాయంత్రం అత్యంత వైభవంగా సాగింది. 32 అడుగుల వినాయక ప్రతిమ నిమజ్జనయాత్రలో డోల్‌ వాయిద్యాలు, లైటింగ్‌ ఆకర్షణగా నిలిచాయి. భక్తులు పెద్దసంఖ్యలో హాజరుకాగా.. యాత్ర నగరంలోని ప్రధాన వీధుల గుండా చింతకుంట వరకు సాగింది.

– కరీంనగర్‌కల్చరల్‌

కరీంనగర్‌ అర్బన్‌: జిల్లాలో వివిధ ఆర్థిక మద్దతు పథకాల కింద నిర్దేశించిన రుణ లక్ష్యాలను వంద శాతం సాధించేలా బ్యాంకర్లు, సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని జిల్లా అదనపు కలెక్టర్‌ డి.శ్రీనివాస్‌రెడ్డి ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో బ్యాంకర్లు, జిల్లా అధికారులతో డీసీసీ, డీఎల్‌ఆర్‌సీ సమీక్ష సమావేశం నిర్వహించగా.. 2026–27 ఆర్థిక సంవత్సరానికి రూ.14,846కోట్లతో రూపొందించిన వార్షిక రుణ ప్రణాళికను ఆవిష్కరించారు. ఇందులో వ్యవసాయ అవసరాలకు రూ.5,755కోట్లు, ఎంఎస్‌ఎంఈ రంగానికి రూ.3,583కోట్లు, విద్యా రుణాలకు రూ.53.25కోట్లు, గృహ రుణాలకు రూ.328.50కోట్లు, ఎగుమతి రంగాలకు రూ.12.80కోట్లు, సామాజిక మౌలిక సదుపాయాలకు రూ.21.61కోట్లు, పునరుత్పాదక ఇంధన రంగానికి రూ.54.97కోట్లు, ఇతర ప్రాధాన్య రంగాలకు రూ.148.41కోట్లు, ఇతర రంగాలకు రూ.4,889కోట్ల రుణాలు అందించేలా ప్రణాళిక రూపొందించినట్లు వెల్లడించారు. రైతులు, స్వయం సహాయక సంఘాలు, యువతతోపాటు వివిధ వర్గాల లబ్ధిదారులకు ఆర్థిక మద్దతు అందించడంలో బ్యాంకర్లు పూర్తిస్థాయిలో సహకరించాలని కోరారు. ఆయా పథకాల కింద పెండింగ్‌లో ఉన్న రుణ ప్రతిపాదనలను త్వరగా పరిష్కరించి అర్హులైన లబ్ధిదారులకు రుణాలు మంజూరు చేయాలని ఆదేశించారు. 2025–26 ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్‌ 2025 నుంచి మార్చి 2026 వరకు జిల్లాలో మొత్తం రూ.20,000.67కోట్ల రుణాలను మంజూరు చేసినట్లు తెలిపారు. వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ రంగాలకు రూ.5,975.41కోట్లు, ఎంఎస్‌ఎంఈ రంగానికి రూ.2,768.59కోట్లు, విద్యా రుణాలకు రూ.17.31కోట్లు, గృహ రుణాలకు రూ.197.15కోట్లు, ఇతర రంగాలకు రూ.5,242కోట్ల రుణాలు మంజూరైనట్లు వివరించారు. వ్యవసాయ శాఖ అధికారులతో సమన్వయం చేసుకొని బ్యాంకర్లు క్యాంపులు నిర్వహించాలని తెలిపారు. అర్హత ఉన్న రైతుకు రుణ సదుపాయం అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఎల్‌డీఎం ఉమాశంకర్‌ నందన, ఆర్బీఐ అధికారి యశ్వంత్‌సాయి, నాబార్డ్‌ డీడీఎం జయప్రకాశ్‌, ఎస్‌బీఐ ఏజీఎం కె.పద్మజ, యూబీఐ చీఫ్‌ మేనేజర్‌, మెప్మా పీడీ స్వరూపరాణి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి చత్రునాయక్‌, ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ తిరుపతిరావు, ఎస్‌బీఐ ఆర్‌ఎస్‌ఈటీఐ డైరెక్టర్‌, ఉద్యానవన శాఖ అధికారి, డీటీడీవో, టీజీబీ, కేడీసీసీబీ డీజీఎం, వివిధ బ్యాంకుల కంట్రోలర్లు, కోఆర్డినేటర్లు, కరీంనగర్‌ లోకల్‌ బ్రాంచ్‌ మేనేజర్లు, జిల్లా పరిశ్రమల కేంద్రం జీఎం సాల్మాన్‌ రాజు, అదనపు డీఆర్‌డీవో రాకేశ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement