30న కలెక్టరేట్‌ ప్రారంభోత్సవం | - | Sakshi
Sakshi News home page

30న కలెక్టరేట్‌ ప్రారంభోత్సవం

Sep 25 2026 1:59 AM | Updated on Sep 25 2026 1:59 AM

ఎట్టకేలకు ముహూర్తం ఖరారు

కలెక్టరేట్‌ సముదాయాన్ని పరిశీలించిన మంత్రి పొన్నం

సుందరంగా తీర్చిదిద్దాలని కలెక్టర్‌కు ఆదేశం

కరీంనగర్‌ అర్బన్‌: ఎట్టకేలకు కలెక్టరేట్‌ ప్రారంభోత్సవానికి రంగం సిద్ధమైంది. ఆగస్టులోనే ప్రారంభోత్సవం ఉంటుందని అధికార యంత్రాంగం భావించగా.. సీఎం విదేశీ పర్యటనతో అనధికారికంగా వాయిదా పడింది. మొత్తంగా ఈనెల 30న ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా కలెక్టరేట్‌ ప్రారంభోత్సవం ఉంటుందని మంత్రి పొన్నం ప్రభాకర్‌ వెల్లడించగా.. కలెక్టర్‌ చిత్రా మిశ్రా తదనుగుణంగా కసరత్తు చేస్తున్నారు. వాస్తవానికి ఇప్పటికే కలెక్టరేట్‌ నిర్మాణం పూర్తవగా.. చిన్నచిన్న పనులు చేస్తున్నారు. ప్రారంభోత్సవం స్పష్టత క్రమంలో రెండు, మూడు రోజుల్లో పూర్తవనున్నాయి. మంత్రి పొన్నం కలెక్టర్‌, సీపీ గౌస్‌ ఆలం, ఎమ్మెల్యేలు మేడిపల్లి సత్యం, కవ్వంపల్లి సత్యనారాయణతో కలిసి గురువారం కలెక్టరేట్‌ను పరిశీలించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం మొత్తం కలియతిరుగుతూ కలెక్టర్‌కు పలు సూచనలు చేశారు. పండుగ వాతావరణంలో ప్రారంభించేందుకు జిల్లా యంత్రాంగం పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలని ఆదేశించారు. నూతన కలెక్టరేట్‌ ప్రారంభోత్సవం, ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లపై కలెక్టర్‌ చాంబర్‌లో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు.

తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ పరిశీలన..

సమీక్ష అనంతరం మంత్రి ఎమ్మెల్యేలు, అధికారులతో కలిసి తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు ఏర్పాటు చేస్తున్న ప్రాంగణాన్ని పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. కలెక్టర్‌ నూతన చాంబర్‌, సమావేశ మందిరంతోపాటు ముఖ్యమంత్రి పర్యటించే ప్రాంతాలు, హెలీప్యాడ్‌ను పరిశీలించారు. సీఎం హెలికాప్టర్‌లో చేరుకున్న తర్వాత కలెక్టరేట్‌ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని కలెక్టరేట్‌లో అధికారులతో సమావేశమై దిశానిర్దేశం చేయనున్నారు. తదుపరి సీఎం రాజన్న సిరిసిల్ల జిల్లా పర్యటనకు వెళ్లనున్నారు. మున్సిపల్‌ కమిషనర్‌ ప్రఫుల్‌ దేశాయ్‌, లైబ్రరీ చైర్మన్‌ సత్తు మల్లేశ్‌, అదనపు కలెక్టర్‌(రెవెన్యూ) శ్రీనివాస్‌రెడ్డి, డీఆర్వో స్వామి, ఆర్డీవో షర్మిల తదితరులున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement